రికార్డు స్థాయిలో డిజిటైజేషన్ పూర్తి
జిల్లాలో 99.91 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్
వెంకటగిరిలో 100 శాతం పూర్తి
జిల్లా వ్యాప్తంగా 17.69 లక్షల ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ
నియోజకవర్గాల వారీగా పురోగతి వివరాల వెల్లడి
తిరుపతి, ఆంధ్రప్రభ : తిరుపతి జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం వేగంగా కొనసాగుతోందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. జూన్ 15 నుంచి జూలై 13 సాయంత్రం 6 గంటల వరకు జిల్లాలో మొత్తం 17,69,438 ఎన్యూమరేషన్ ఫారాలు బూత్ స్థాయి అధికారుల ద్వారా స్వీకరించినట్లు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. అందిన ఫారాలన్నింటినీ ఆన్లైన్లో డిజిటైజేషన్ చేసే ప్రక్రియను వేగవంతంగా చేపట్టగా, ఇప్పటివరకు 17,67,885 ఫారాల డిజిటైజేషన్ పూర్తై 99.91 శాతం పురోగతి నమోదైనట్లు తెలిపారు.
జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో డిజిటైజేషన్ ప్రక్రియ తుది దశకు చేరుకుందని కలెక్టర్ పేర్కొన్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో 2,45,781 ఎన్యూమరేషన్ ఫారాలు స్వీకరించగా, వాటన్నింటినీ డిజిటైజేషన్ చేసి 100 శాతం లక్ష్యాన్ని సాధించారు. సుళ్లూరుపేట నియోజకవర్గంలో 2,43,284 ఫారాలకు గాను 2,43,242 ఫారాలు డిజిటైజేషన్ పూర్తై 99.98 శాతం, కోడూరు (ఎస్సీ) నియోజకవర్గంలో 2,06,065 ఫారాలకు గాను 2,05,927 ఫారాలు డిజిటైజేషన్ పూర్తై 99.93 శాతం పురోగతి నమోదైంది. అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో 3,13,795 ఫారాల్లో 3,12,895 ఫారాలు డిజిటైజేషన్ పూర్తై 99.71 శాతం, తిరుపతి నియోజకవర్గంలో 2,95,288 ఫారాల్లో 2,95,114 ఫారాలు డిజిటైజేషన్ పూర్తై 99.94 శాతం, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 2,49,123 ఫారాల్లో 2,48,895 ఫారాలు డిజిటైజేషన్ పూర్తై 99.91 శాతం, సత్యవేడు నియోజకవర్గంలో 2,16,102 ఫారాల్లో 2,16,040 ఫారాలు డిజిటైజేషన్ పూర్తై 99.97 శాతం నమోదైనట్లు వివరించారు.
