గొర్రెల కాపరి మృతి కేసులో కీలక మలుపు..

మాజీ మంత్రి తనయుడు పోలీసులకు లొంగుబాటు

పలాస, ఆంధ్రప్రభ : కాశీబుగ్గ ఇండస్ట్రియల్ పార్క్ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి దుబ్బ దానయ్య మృతి కేసు కీలక మలుపు తిరిగింది. ప్రమాదానికి కారణమైనది మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు సీదిరి ఆరవ్ వర్మ అని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో ఆరవ్ వర్మ సోమవారం న్యాయవాదితో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

పోలీసుల వివరాల ప్రకారం.. కాశీబుగ్గ సూదికొండకు చెందిన దుబ్బ దానయ్య గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం రాత్రి తన పిల్లల ఆరోగ్యం బాగోలేదని సమాచారం రావడంతో ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా, రాత్రి సుమారు 9.30 గంటలకు కాశీబుగ్గ నుంచి జీఎంఈ కాలనీ వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం ఆయనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దానయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.

ప్రమాదం అనంతరం ఆరవ్ వర్మ తన తండ్రి, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఆరవ్ వర్మను రక్షించేందుకు ప్రయత్నంలో భాగంగా వైసీపీ మాజీ కో-ఆప్షన్ సభ్యుడి కుమారుడు సిద్దార్థ త్యాడి ప్రమాదం తానే చేశానని చెప్పి పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో తొలుత పోలీసులు సిద్దార్థ త్యాడిపై కేసు నమోదు చేశారు.

అయితే, ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పటికీ సిద్దార్థ త్యాడికి ఎలాంటి గాయాలు లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో ఘటనాస్థలం పరిసరాల్లోని పెట్రోల్ బంకులు, వ్యాపార సంస్థలు, ప్రైవేటు ఆస్పత్రుల సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు.

దర్యాప్తులో ప్రమాదానికి ముందు ఆరవ్ వర్మ ద్విచక్ర వాహనంలో పెట్రోల్ నింపిన దృశ్యాలు, అనంతరం రాత్రి 10 గంటల సమయంలో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు సీసీటీవీ ఫుటేజీల ద్వారా గుర్తించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం ఆయనను విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఆధారాల నేపథ్యంలో అసలు విషయం వెలుగులోకి రావడంతో ఆరవ్ వర్మ పోలీసులకు లొంగిపోయాడు.

ఇదిలా ఉండగా, మృతుడు దుబ్బ దానయ్య కుటుంబం ఆర్థికంగా బలహీనంగా ఉండటంతో వారికి పరిహారం అందించేందుకు చర్చలు జరిగినట్లు సమాచారం. తెలుగు దేశం పార్టీ యాదవ నాయకుల సమక్షంలో సిద్దార్థ త్యాడి తండ్రి గౌరీ త్యాడితో జరిగిన చర్చల్లో బాధిత కుటుంబానికి రూ.8.50 లక్షల నష్టపరిహారం చెల్లించేందుకు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఇందులో ముందుగా రూ.1.50 లక్షలు, రాజీ సమయంలో మరో రూ.7 లక్షలు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.