జాతీయ రహదారిపై బైక్ ఢీకొని మహిళ మృతి
చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : మండలంలోని బొప్పూడి గ్రామ సమీపంలోని జాతీయ రహదారి-16పై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది.
పోలీసుల వివరాల ప్రకారం.. బొప్పూడి గ్రామానికి చెందిన గూడూరు వెంకటరమణ (60) ప్రతిరోజు మాదిరిగానే కూలి పనికి వెళ్లేందుకు గ్రామ పరిధిలోని ఎంఎల్ గూడెమ్స్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఉదయం సుమారు 8 గంటల సమయంలో బొప్పూడి గ్రామ పరిధిలోని చీరాల ఓడరేవుకు వెళ్లే ఫ్లైఓవర్ కింద జాతీయ రహదారి-16 దాటుతుండగా, గుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న యమహా ద్విచక్ర వాహనం వేగంగా, నిర్లక్ష్యంగా వచ్చి ఆమెను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో వెంకటరమణ తలకు, ఎడమ చేతికి, కుడి కాలికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా చిలకలూరిపేటలోని ఆర్కే ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కొమ్మినేని ఆస్పత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు.
మృతురాలి కుమార్తె బత్తినేని శేషమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, శవపంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమాదానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
