17 న పెద్దపల్లిలో జాబ్ మేళా..
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకుల కోసం ఈ నెల 17న జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎం. రాజశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బ్రాడ్‌బ్యాండ్ కంపెనీలో మొత్తం 54 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. వీటిలో ఇంజనీర్ – 23, వైర్‌మెన్ – 23, సేల్స్ ఎగ్జిక్యూటివ్ – 8 పోస్టులు ఉన్నాయని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల ప్రాంతాల్లో విధులు కేటాయిస్తారని చెప్పారు.
ఇంజనీర్ పోస్టులకు డిగ్రీ లేదా డిప్లొమాతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు అర్హులని, వైర్‌మెన్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని తెలిపారు. సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
18 నుంచి 34 సంవత్సరాల వయస్సు గల యువతీ, యువకులు ఈ నెల 17న ఉదయం 11 గంటలకు సమీకృత జిల్లా కలెక్టరేట్ సముదాయంలోని రూమ్ నెం. 233కు హాజరై తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు అప్డేట్ చేసిన బయోడేటా/రెజ్యూమ్, విద్యార్హతల ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలు, ఆధార్ కార్డు జిరాక్స్, అనుభవ ధ్రువపత్రం (ఉంటే) వెంట తీసుకురావాలని తెలిపారు.
మరిన్ని వివరాల కోసం 9908674056, 8985336947, 8121262441 నంబర్లను సంప్రదించాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి సూచించారు.
