నగర పరి శుభ్రత కోసం పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యం….

కమిషనర్ ధ్యాన చంద్ర….

విజయవాడ కార్పోరేషన్, ఆంధ్రప్రభ : నగర పరి శుభ్రత కోసం పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యం అని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా మహాత్మా గాంధీ రోడ్, బెంజ్ సర్కిల్, స్క్యూ బ్రిడ్జి, రాణిగారితోట, కృష్ణలంక ప్రాంతాల్లో పర్యటించి క్షేత్ర స్థాయి లో పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కమిషనర్ ధ్యాన చంద్ర మాట్లాడుతూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. వారు ప్రతి రోజూ వ్యర్థాల తో పోరాడుతూ నగర పరిశుభ్రత కోసం అంకితభావంతో పని చేస్తున్నారని కొనియాడారు. విధుల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, పని ముట్లు సక్రమంగా పని చేయక పోయినా ఎటువంటి సంకోచం లేకుండా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అవసరమైన పని ముట్లు, భద్రతా పరికరాలు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు నగర పాలక సంస్థ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు.

ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రధాన రహదారులు, కూడళ్లు, కాలనీల్లో ప్రతిరోజూ నిర్ణీత సమయానికి పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని, చెత్తను ఎప్పటికప్పుడు సేకరించి శాస్త్రీయ పద్ధతిలో తరలించాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కాలువలు, డ్రైన్లలో చెత్త పేరుకుపోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.నగరం లో పరిశుభ్రమైన వాతావరణాన్ని కొనసాగించేందుకు పారిశుద్ధ్య సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, ప్రజలు కూడా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ నగర పాలక సంస్థకు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. రాణిగారి తోటలోని అన్నా క్యాంటీన్‌ను కమిషనర్ పరిశీలించారు.

క్యాంటీన్‌లో భోజనం నాణ్యత, పరిశుభ్రత, ఆహార పంపిణీ విధానం, తాగునీటి సౌకర్యం, వంటశాల నిర్వహణను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అన్నా క్యాంటీన్ల నోడల్ అధికారులు ప్రతి రోజూ క్షేత్ర స్థాయి లో తనిఖీలు నిర్వహించి, ఎటువంటి సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.