సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఆదర్శం..
మహబూబ్నగర్ రూరల్, ఆంధ్రప్రభ : మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు పర్యావరణ పరిరక్షణకు వినూత్న సందేశం ఇచ్చారు.
మధ్యాహ్న భోజన సమయంలో పేపర్ ప్లేట్ల వినియోగం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందనే ఉద్దేశంతో శిక్షణలో పాల్గొన్న దాదాపు వంద మంది ఉపాధ్యాయులు ఎవరికి వారే తమ ఇళ్ల నుంచి స్టీల్ ప్లేట్లు తీసుకొచ్చి వాటిలోనే భోజనం చేశారు.
పర్యావరణ హిత చర్యతో ప్లాస్టిక్, పేపర్ ప్లేట్ల వినియోగాన్ని తగ్గించాలనే సందేశాన్ని ఉపాధ్యాయులు ఆచరణలో చూపించడంతో కార్యక్రమానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా పలువురు అధికారులు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల పర్యావరణ చైతన్యాన్ని అభినందిస్తూ, ప్రతి ఒక్కరూ ఇలాంటి అలవాట్లను అలవరచుకోవాలని సూచించారు.
