రామమందిరం విరాళాల వ్యవహారంపై సుప్రీంకోర్టు నోటీసులు…
ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ : అయోధ్య శ్రీరామ మందిరానికి భక్తులు సమర్పించిన విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌కు సోమవారం నోటీసులు జారీ చేసింది. అలాగే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్‌ఐటీ) ఇప్పటివరకు జరిగిన దర్యాప్తుపై స్టేటస్ రిపోర్టు సమర్పించాలని ఆదేశించింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. స్టేటస్ రిపోర్టును సీల్డ్ కవర్‌లో సమర్పిస్తామని కోర్టుకు తెలిపారు. అయితే ఆలయ ట్రస్ట్‌కు నోటీసులు జారీ చేయకుండా వాయిదా వేయాలన్న ఆయన విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది.
విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు సీసీటీవీ దృశ్యాలు, ఇతర ఆర్థిక రికార్డులను భద్రపరచాలని కోర్టును కోరారు. అలాగే ఎస్‌ఐటీ సమర్పించే స్టేటస్ రిపోర్టు కాపీని తమకూ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి “దర్యాప్తు కొనసాగుతోంది.. ఆ అంశాన్ని తర్వాత పరిశీలిస్తాం” అని వ్యాఖ్యానించారు.
ఈ కేసులో నరేంద్ర కుమార్ గోస్వామి, అజయ్ కుమార్ రాయ్, దినేశ్ కుమార్ యాదవ్, ఆర్జేడీ ఎంపీ సుధాకర్ సింగ్, హిందూ ధర్మ పరిషత్ తదితరులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. విరాళాల దుర్వినియోగ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు, కాగ్ ఆడిట్, ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని వారు కోరారు.
ట్రస్ట్‌కు వచ్చిన నగదు, బ్యాంకు లావాదేవీలు, డిజిటల్ చెల్లింపులు, బంగారం, వెండి తదితర విరాళాల వివరాలను పారదర్శకంగా వెల్లడించాలని కూడా పిటిషన్లలో కోరారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎస్‌ఐటీ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ప్రస్తుతం ఎనిమిది మంది అదుపులో ఉన్నట్లు సమాచారం.
