రసాయన పరిశ్రమల కాలుష్యంపై కలెక్టర్‌కు గ్రామస్తుల ఫిర్యాదు
చిట్యాల, ఆంధ్రప్రభ: పిట్టంపల్లి గ్రామంలో రసాయన పరిశ్రమల వల్ల తీవ్ర వాయు కాలుష్యం ఏర్పడి ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ గ్రామస్థులు సోమవారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బడుగుల చంద్రశేఖర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా స్థానిక రసాయన పరిశ్రమల నుంచి వెలువడుతున్న దట్టమైన పొగ, దుర్వాసన, ధూళి కారణంగా గ్రామంలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుందని తెలిపారు. దీంతో శ్వాసకోశ సంబంధిత సమస్యలు సహా ఇతర ఆరోగ్య ఇబ్బందులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కాలుష్యానికి కారణమైన పరిశ్రమలపై వెంటనే సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవడంతో పాటు గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.
