ప్రధాన రహదారిపై ఇసుక లారీల పార్కింగ్ నిలిపివేయాలి
- కలెక్టర్‌కు సర్పంచ్ వినతి
మహాదేవపూర్, ఆంధ్రప్రభ : కాళేశ్వరం–మద్దులపల్లి ప్రధాన రహదారిపై ఇసుక లారీలను ఇష్టానుసారంగా పార్కింగ్ చేయడంతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మద్దులపల్లి గ్రామ సర్పంచ్ ఎల్పుల సరిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఇసుక కాంట్రాక్టర్లు ప్రధాన రహదారిపై వందలాది భారీ లారీలను గంటల తరబడి నిలిపివేయడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని ఆమె వినతిపత్రంలో పేర్కొన్నారు. రహదారిపై ఎక్కడపడితే అక్కడ లారీలను పార్కింగ్ చేయడం వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించక ప్రమాదాలు జరిగే పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. రోజురోజుకూ ప్రమాదాల ముప్పు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రధాన రహదారిపై ఇసుక లారీల వరుసల కారణంగా ఆర్టీసీ బస్సులు, పాఠశాల వాహనాలు, ద్విచక్ర వాహనదారులతో పాటు అత్యవసర సేవల కోసం వెళ్లే అంబులెన్స్‌లు కూడా సకాలంలో ప్రయాణించలేని పరిస్థితి ఏర్పడుతోందని సర్పంచ్ సరిత తెలిపారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే విలువైన ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సమస్యపై గతంలో పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ శాశ్వత పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలు, భద్రతను దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం–మద్దులపల్లి ప్రధాన రహదారిపై ఇసుక లారీల పార్కింగ్‌ను పూర్తిగా నిషేధించాలని కోరారు.
అలాగే, ఇసుక లారీల కోసం ప్రధాన రహదారికి దూరంగా ప్రత్యేక ప్రత్యామ్నాయ పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించి రహదారిపై లారీలను నిలిపే కాంట్రాక్టర్లు, వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను సర్పంచ్ ఎల్పుల సరిత విజ్ఞప్తి చేశారు. గ్రామ ప్రజలు, ప్రయాణికుల సౌకర్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలని కోరారు.
