గురుకుల పాఠశాలలో ఆల్బెండాజోల్ మాత్రల పంపిణీ

వికారాబాద్, జూలై 13 (ఆంధ్రప్రభ): వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని అనంతగిరిపల్లిలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల (శివారెడ్డిపేట)లో సోమవారం జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వికారాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం అనన్య విద్యార్థులకు ఆల్బెండాజోల్ (నులిపురుగుల నివారణ) మాత్రలు పంపిణీ చేసి వేయించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య, ఆరోగ్యశాఖ చేపడుతున్న నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని ప్రతి పాఠశాలలో సమర్థవంతంగా అమలు చేయాలని అన్నారు. అర్హులైన ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా ఆల్బెండాజోల్ మాత్రలు అందేలా సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌ చైర్మన్ అర్ధ సుధాకర్ రెడ్డి, రామాయగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ సౌమ్య, పాఠశాల ప్రిన్సిపాల్ రమాదేవి, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.