వరద నష్టపరిహారం కోసం రైతుల నిరీక్షణ..
- వెంటనే జమ చేయాలని విజ్ఞప్తి
ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో గత ఏడాది అక్టోబర్‌లో మొంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పంట పొలాలు పూర్తిగా నీటమునిగాయి. దీంతో వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిని రైతులు భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూశారు.
పంటల నష్టాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి రూ.10 వేల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. అయితే ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఇప్పటికీ పలువురు అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కాకపోవడంతో వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పంట నష్టంతో ఇప్పటికే అప్పుల భారంలో కూరుకుపోయిన రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడం, తదుపరి సాగు పనులు చేపట్టడం కూడా కష్టసాధ్యంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారాన్ని ఎలాంటి జాప్యం లేకుండా అర్హులైన ప్రతి రైతు ఖాతాలో వెంటనే జమ చేయాలని వారు కోరుతున్నారు.
అధికారులు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి, నష్టపరిహారం పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు తక్షణ ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
