బీఎల్‌వోలు ప్రజలకు అవగాహన కల్పించాలి

వికారాబాద్, ఆంధ్రప్రభ: ప్రభుత్వం చేపట్టిన సర్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం నేపథ్యంలో బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటరు నమోదు పూర్తయ్యేలా చూడాలని వికారాబాద్ మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ అనిల్ యాదవ్ సూచించారు. సోమవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 33వ వార్డు బీటీఎస్ కాలనీలో బీఎల్‌వో, బీఎల్‌ఏలతో కలిసి ఆయన కార్యక్రమంలో పాల్గొని వారి పనితీరును పరిశీలించారు.

ఈ సందర్భంగా అనిల్ యాదవ్ మాట్లాడుతూ ఏ ఒక్క ఓటరు కూడా నమోదు ప్రక్రియలో మిస్ కాకుండా చూడాల్సిన బాధ్యత బీఎల్‌వోలపై ఉందన్నారు. ప్రజలకు అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తూ అవగాహన కల్పించాలని కోరారు. రెండు ప్రాంతాల్లో ఓటరు పేర్లు నమోదై ఉంటే ఎన్నికల నిబంధనల ప్రకారం శిక్షార్హమని ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని సూచించారు.