Road Dispute | ప్రొద్దుటూరులో రోడ్డు వివాదం..

టీడీపీ–వైసీపీ నేతల మధ్య ఉద్రిక్తత
సిమెంట్ రోడ్డు నాణ్యతపై మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు..
కాంట్రాక్ట్ పనులపై వాగ్వాదం..
ఇరువర్గాల మధ్య తోపులాట

Road Dispute | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో సిమెంట్ రోడ్డు నాణ్యత అంశం రాజకీయ దుమారానికి దారితీసింది. ఇటీవల నిర్మించిన సిమెంట్ రోడ్డుపై పగుళ్లు ఏర్పడ్డాయని ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే మీడియాకు వివరాలు వెల్లడించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన స్థానిక ప్రజాప్రతినిధుల అనుచరులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కుమారుడు కొండారెడ్డి కూడా అక్కడికి చేరుకుని మాజీ ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం.

రోడ్డు నిర్మాణంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని టీడీపీ నాయకులు వాదించగా, పనుల నాణ్యతపై విచారణ జరపాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు. దీంతో రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, పరిస్థితి అదుపుతప్పకుండా పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. రోడ్డు నాణ్యతపై వచ్చిన ఆరోపణలపై అధికారుల స్పందన రావాల్సి ఉంది.