A2 Milk | నిజంగానే సాధారణ పాల కంటే మంచివేనా?

ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: పాలు మానవ శరీరానికి సంపూర్ణ ఆహారంగా భావిస్తారు. రోజూ గ్లాసు పాలు తాగితే మంచిదని చిన్నప్పటి నుంచి వింటునే ఉంటున్నాం. పాలలు శరీరానికి కాలిషియం, విటమిన్లు, మాంసకృతులు వంటి పోషకాలను అందించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అయితే ఇటీవల కాలంలో ఏ2 పాలు అనే పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఏ2 పాలా.. అని ఆశ్చర్యపోతున్నారా.. అవునండీ ఈ పాలు సాధారణ పాలతో పోలిస్తే.. జీర్ణం కావడం సులభమని, ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయని ప్రచారం జరుగుతోంది. అసలు ఏ2 పాలు అంటే ఏమిటి? వాటి ప్రత్యేకత ఏమిటి? అని తెలుసుకుందామా..

ఏ2 పాలు అంటే ఏమిటి?

సాధారణంగా మార్కెట్‌లో లభించే పాలలో ఏ1, ఏ2 అనే రెండు రకాల ప్రోటీన్లు ఉంటాయి. ఏ2 పాలలో మాత్రం ఏ2 రకం మాత్రమే ఉండటం దీని ప్రత్యేకత కొన్ని ప్రత్యేక జాతుల ఆవులు, గిర్ , సాహివాల్ వంటి భారతీయ దేశీయ ఆవు జాతుల ఇచ్చే పాలలో ఏ2 బీటా-కేసిన్ అనే ప్రోటీన్ మాత్రమే ఉంటుంది.

ఏ2 పాల వల్ల కలిగే ప్రయోజనాలు..

  • కొంతమందికి సాధారణ పాలు తాగితే కడుపు ఉబ్బరం, అసౌకర్యం వంటి సమస్యలు కనిపిస్తాయి. అలాంటి వారికి ఏ2 పాలు తేలికగా జీర్ణమయ్యే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
  • ఇందులో పోషకాలు సమృద్ధి కూడా ఎక్కువే
  • ఏ2 పాలలో శరీరానికి అవసరమైన మాంసకృత్తులు, కాల్షియం, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకలు, కండరాల బలానికి ఉపయోగపడతాయి.
  • గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
  • సమతుల ఆహారంలో భాగంగా ఏ2 పాలను తీసుకోవడం గుండె ఆరోగ్యానికి ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
  • కుటుంబమంతా తీసుకోవచ్చు
  • పిల్లలు, పెద్దలు, వృద్ధులు తగిన పరిమాణంలో తీసుకోవచ్చు. అయితే ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

అసలు సాధారణ పాలతో తేడా ఏమిటి?

సాధారణ పాలలో ఏ1, ఏ2 రెండు రకాల ప్రోటీన్లు ఉంటాయి. ఏ2 పాలలో మాత్రం ఏ2 ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. అందుకే కొందరికి ఇది జీర్ణక్రియ పరంగా అనుకూలంగా ఉండవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే ప్రతి ఒక్కరికీ ఇదే ఫలితం ఉంటుందని చెప్పడానికి తగిన శాస్త్రీయ ఆధారాలు ఇంకా పూర్తిగా లేవు. పాల రుచి విషయంలో కూడా తేడా లేకపోయినా మీ శరీరంపై చూపే ప్రభావంలో మీరు తేడాను గమనించవచ్చు.

ఏ2 పాలను ఎలా తీసుకోవాలి?

-ఉదయం లేదా రాత్రి తాగవచ్చు.
-పండ్లతో కలిపి పానీయంగా తీసుకోవచ్చు.
-సమతుల ఆహారంతో పాటు తీసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది.

  • ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుల సలహా తీసుకోవాలి.

ఏ2 పాలు ఆరోగ్యకరమైన ఎంపిక కావచ్చు. అయితే ఇవి అన్ని వ్యాధులకు పరిష్కారం కావు. సమతుల ఆహారం, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తేనే మంచి ఫలితాలు పొందవచ్చు. పాలు ఎంపిక చేసుకునే ముందు మీ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.