భీమేశ్వరాలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
40 వేల మంది భక్తుల దర్శనం
ఆర్జిత సేవలతో ఆలయానికి రూ.20 లక్షల ఆదాయం
వేములవాడ, ఆంధ్రప్రభ: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ దేవాలయమైన భీమేశ్వరాలయంలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. సెలవు దినం కావడంతో తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. తెల్లవారుజామున పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు.
భక్తులు కోడె మొక్కు, అభిషేకం, కుంకుమ పూజ తదితర ఆర్జిత సేవల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, ఆలయానికి సుమారు రూ.20 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
సోమవారం స్వామివారికి ప్రీతిపాత్రమైన రోజు కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని ఆలయ వర్గాలు వెల్లడించాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు.
