అనంతగిరి ట్రెక్కింగ్‌లో మహిళ మృతి..

  • గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినట్లు అనుమానం

వికారాబాద్ క్రైం, ఆంధ్రప్రభ : వికారాబాద్‌లోని అనంతగిరి అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఓ మహిళ మృతి చెందిన ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.

సమాచారం ప్రకారం, అనంతగిరి అటవీ శాఖ అర్బన్ పార్క్ నుంచి ట్రెక్కింగ్ పాయింట్ వాచ్ టవర్ సమీపంలో బంధువులతో కలిసి ట్రెక్కింగ్ చేస్తున్న ప్రియా (47) ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆమె బంధువులు వెంటనే అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు.

అటవీ శాఖ సిబ్బంది ఆటోను ఏర్పాటు చేసి, బంధువుల సహాయంతో ఆమెను వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

మహిళ ఘటన జరిగిన ప్రాంతంలోనే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని వైద్యులు ప్రాథమికంగా అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.