స్వగ్రామానికి చేరుకున్న ప్రసన్న లక్ష్మి భౌతికకాయం..

ఇబ్రహీంపట్నం (ఆంధ్రప్రభ): అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఈ నెల 5న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎన్టీఆర్ జిల్లా మూలపాడుకు చెందిన ప్రసన్న లక్ష్మి (30) భౌతికకాయం ఆదివారం ఉదయం స్వగ్రామానికి చేరుకుంది. ఆరు రోజుల అనంతరం ప్రత్యేక విమానంలో శనివారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్న భౌతికకాయాన్ని అంబులెన్స్‌లో ఆదివారం ఉదయం మూలపాడుకు తీసుకొచ్చారు. గ్రామస్థులు, బంధువుల సందర్శనార్థం కొద్దిసేపు ఆమె భౌతికకాయాన్ని స్వగృహం వద్ద ఉంచారు.

ప్రసన్న లక్ష్మి భౌతికకాయాన్ని చూసిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం అంతిమయాత్ర నిర్వహించి మూలపాడు హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.