డ్రైనేజీ పొంగిపొర్లి దుర్వాసన.. అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం
వికారాబాద్, (ఆంధ్రప్రభ): వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 22వ వార్డు రాజీవ్ గృహకల్ప, రామయ్యగూడ హౌసింగ్ బోర్డ్ ఎంఐజీ కాలనీలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పొంగిపొర్లుతూ దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజీవ్ గృహకల్ప 109వ బ్లాక్ నుంచి 111వ బ్లాక్ వరకు డ్రైనేజీ నీరు ఇళ్ల ముందే పారుతుండటంతో ప్రజలు తమ ఇళ్లకు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారు.
ఈ సమస్యపై పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సంబంధిత కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుర్వాసన కారణంగా ఇళ్లలో ప్రశాంతంగా ఉండలేకపోతున్నామని, భోజనం చేయడం కూడా కష్టంగా మారిందని చెబుతున్నారు. వెంటనే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
