rayanapadu రూ 35 కోట్ల తో సర్వాంగ సుందరంగా ముస్తాబు..

ఈ నెల 17న ప్రారంభం.. విజయవాడ రద్దీకి ప్రత్యామ్నాయ శాటిలైట్ టెర్మినల్ సిద్ధం…

ఎంపీ కేశినేని చిన్ని చొరవతో వేగంగా పూర్తైన అమృత్ భారత్ పనులు..లిఫ్టులు.. ఏసీ వెయిటింగ్ హాల్.. విశాల ప్లాట్‌ఫారాలు..
ప్రయాణికులకు ప్రపంచస్థాయి కార్పొరేట్ వసతులు…
కొండపల్లి కళారూపాలతో మెరిసిన స్టేషన్..
భవిష్యత్ రైల్వే హబ్‌గా రాయనపాడు
ప్రతిరోజూ 12 రైళ్లు..
త్వరలో మరిన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కూడా నిలయంగా మారనున్న స్టేషన్..

ఎన్టీఆర్ బ్యూరో ఆంధ్రప్రభ : విజయవాడ ప్రధాన రైల్వే స్టేషన్‌పై రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి శాశ్వత పరిష్కారంగా రూపుదిద్దుకున్న రాయనపాడు రైల్వే స్టేషన్ ప్రారంభానికి ముస్తాబైంది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ.35 కోట్లకు పైగా వ్యయంతో అత్యాధునిక ప్రమాణాలతో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తికాగా, ఈ నెల 17న స్టేషన్‌ను ప్రజలకు అంకితం చేయనున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని నిరంతర అనుసరణ, కేంద్ర రైల్వే శాఖతో సమన్వయం కారణంగా రికార్డు సమయంలో పనులు పూర్తవడంతో రాయనపాడు ఇక విజయవాడకు ప్రత్యామ్నాయ శాటిలైట్ టెర్మినల్‌గా సేవలందించేందుకు సిద్ధమైంది.

.. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా…

ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్టేషన్‌ను పూర్తిస్థాయిలో రాయనపాడు రైల్వే స్టేషన్ ను ఆధునీకరించారు. విశాలమైన ప్లాట్‌ఫారాలు, అత్యాధునిక ఏసీ ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్, ఆధునిక టికెట్ కౌంటర్లు, స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం, మాడ్యులర్ మరుగుదొడ్లు, దివ్యాంగులకు ప్రత్యేక ర్యాంపులు, టాక్టైల్ పాత్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లపై లిఫ్టులు ఏర్పాటు చేశారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించేలా అన్ని వసతులను కల్పించారు.

.. సరికొత్త అందచందాలతో…

స్టేషన్‌కు సరికొత్త అందాన్ని తీసుకొచ్చేలా ముఖద్వారం, అంతర్గత ప్రాంగణాన్ని ఆధునిక శైలిలో తీర్చిదిద్దారు. రాష్ట్ర కళా వైభవానికి ప్రతీకగా నిలిచే కొండపల్లి బొమ్మల కళాచిత్రాలతో భవనాన్ని అలంకరించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. పచ్చదనంతో నిండిన ఉద్యానవనం, విశాల పార్కింగ్, వీధి దీపాలు, పాదచారుల మార్గాలు, ల్యాండ్‌స్కేపింగ్‌తో స్టేషన్‌కు హైటెక్ రూపు తీసుకొచ్చారు. రూ.13.33 కోట్లతో ప్లాట్‌ఫారమ్-1ను 670 మీటర్ల పొడవుతో ఆధునీకరించగా, రూ.6.38 కోట్లతో 340 మీటర్ల పొడవైన భారీ షెల్టర్ నిర్మించారు. రూ.5.77 కోట్లతో ఏసీ వెయిటింగ్ హాల్, ఆధునిక మరుగుదొడ్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లపై రెండు లిఫ్టులను ఏర్పాటు చేశారు. ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద 483 మీటర్ల ప్రహరీ గోడ, విశాల ప్రవేశ–నిష్క్రమణ ద్వారాలు, 651 చదరపు మీటర్ల పార్కింగ్ స్థలం కూడా సిద్ధమయ్యాయి.

.. పెరిగిన రైలు రాకపోకలు..

ప్రస్తుతం రాయనపాడు రైల్వే స్టేషన్ మీదుగా రోజుకు 12 రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. వాటిలో కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా రాయనపాడులో ఆగనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో విజయవాడ ప్రధాన స్టేషన్‌పై ఒత్తిడి తగ్గించడంతో పాటు ఈ ప్రాంతానికి ప్రధాన రైల్వే అనుసంధాన కేంద్రంగా రాయనపాడు ఎదగనుందని అంచనా వేస్తున్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా విజయవాడ స్టేషన్ పై పెరుగుతున్న రద్దీ ఒత్తిడిని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ సాటిలైట్ స్టేషన్ గా రాయినపాడు నిలవనుంది.

.. కీలక రైల్వే కేంద్రంగా రాయినపాడు..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పించిన అమృత్ భారత్ స్టేషన్ పథకం దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల రూపురేఖలను మార్చుతోంది రాయనపాడు స్టేషన్‌లో చేపట్టిన అన్ని అభివృద్ధి పనులు వంద శాతం పూర్తయ్యాయి. ప్రయాణికులకు భద్రత, సౌకర్యం, ఆధునిక సేవలను అందించడమే లక్ష్యం. ప్రతి పనిని నాణ్యతతో పూర్తి చేసాం.విజయవాడ పార్లమెంట్ పరిధిలో రాయనపాడు స్టేషన్ భవిష్యత్తులో కీలక రైల్వే కేంద్రం.

కేశినేని శివనాథ్ (చిన్ని)
పార్లమెంటు సభ్యుడు
విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం..