Cyber Fraud | ఓటీపీ చెప్పొద్దని పోలీసుల హెచ్చరిక
బీఎల్వో పేరుతో ఫోన్లు, వాట్సాప్‌లో నకిలీ ఫైళ్లతో మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ పేరుతో బ్యాంకు ఖాతాలపై కన్నేసిన కేటుగాళ్లు
అనుమానాస్పద కాల్స్, లింకులు వస్తే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని సూచన
Cyber Fraud |ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు ఉన్న అవగాహనను ఆసరాగా చేసుకుని బ్యాంకు ఖాతాల్లోని డబ్బును దోచుకునేందుకు కేటుగాళ్లు ప్రయత్నిస్తున్నట్లు హెచ్చరించారు.
పోలీసుల వివరాల ప్రకారం, కొందరు సైబర్ నేరగాళ్లు బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్వో) పేరుతో ఫోన్ చేసి, ఓటర్ల వివరాల ధ్రువీకరణ లేదా సవరణ కోసం అంటూ ఓటీపీ (వన్ టైమ్ పాస్వర్డ్) చెప్పాలని కోరుతున్నారు. మరికొందరు వాట్సాప్‌లో అధికారిక పత్రాల్లా కనిపించే ఫైళ్లు, లింకులు లేదా యాప్‌లను పంపించి వాటిని తెరవాలని ఒత్తిడి చేస్తున్నారు. అలాంటి ఫైళ్లు లేదా లింకులు తెరిస్తే మొబైల్లో హానికర సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయ్యే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరించారు.
ఎన్నికల అధికారులు లేదా బీఎల్వోలు బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ, పాస్వర్డ్లు లేదా ఇతర రహస్య ఆర్థిక సమాచారం ఎట్టి పరిస్థితుల్లోనూ అడగరని పోలీసులు స్పష్టం చేశారు. అందువల్ల ఇలాంటి ఫోన్ కాల్స్, సందేశాలు లేదా వాట్సాప్ ఫైళ్లను నమ్మవద్దని సూచించారు.
అనుమానాస్పద కాల్స్, లింకులు లేదా మోసపూరిత సందేశాలు వచ్చిన వెంటనే స్పందించకుండా, సంబంధిత ఎన్నికల అధికారులను సంప్రదించి నిజానిజాలు తెలుసుకోవాలని సూచించారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైనట్లు అనుమానం వచ్చినా, లేదా పొరపాటున వివరాలు పంచుకున్నా వెంటనే జాతీయ సైబర్ మోసాల హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని, అలాగే సమీప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు సూచించారు. త్వరగా ఫిర్యాదు చేస్తే ఆర్థిక నష్టాన్ని నివారించే అవకాశం ఉంటుందని తెలిపారు.
