Kavitha | బీఆర్‌ఎస్‌లో చేరేది లేదు..

Kavitha | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: సింగరేణి బాయి బాట కార్యక్రమంలో భాగంగా కార్మికులతో మమేకమవుతున్నట్లు టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవిత తెలిపారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ…. సింగరేణిలో పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై యాజమాన్యం వెంటనే దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ విధానాలు, బకాయిల కారణంగా సింగరేణి సంస్థపై భారీ ఆర్థిక భారం పడిందని, దీంతో పని ముట్లు కొనలేని పరిస్థితి ఏర్పడిందని ఆమె ఆరోపించారు. అధికారులకు ఒక రూల్, కార్మికులకు మరో రూల్ అన్నట్లుగా యాజమాన్యం వ్యవహరిస్తోందని విమర్శించారు.

తెలంగాణ హక్కుగా రావాల్సిన బొగ్గు బ్లాక్‌లు కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా ప్రైవేటీకరణ దిశగా వెళ్తున్నాయని కవిత అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు 62వేల మంది రెగ్యులర్ కార్మికులు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 38 వేలకు పడిపోయిందని పేర్కొన్నారు.

డిపెండెంట్ ఉద్యోగాల కోసం నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డ్ నిర్వహించాలని, వారసత్వ ఉద్యోగాల నియామకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం ఈ అంశంపై స్పష్టత ఇవ్వకపోతే ఈ నెల 20 నుంచి రామగుండంలో నిరవధిక దీక్ష చేపడతామని హెచ్చరించారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌పై కూడా కవిత తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు వివరణ పేరుతో నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ ఖాతాలో ఉన్న రూ.1,400 కోట్లు క్విడ్ ప్రోకో ద్వారా వచ్చాయని, ఆ నిధులపై సమగ్ర విచారణ జరిపి ఉద్యమకారుల కుటుంబాలకు పంచాలని డిమాండ్ చేశారు. అలాగే, కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు బీఆర్‌ఎస్‌లో చేరే ప్రసక్తే లేదు అని స్పష్టం చేశారు.