బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లోకి చేరికలు
సుల్తానాబాద్, ఆంధ్రప్రభ: గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో పలువురు సర్పంచులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు.
బుధవారం సుల్తానాబాద్‌లో మండలంలోని కదంబాపూర్ గ్రామ సర్పంచ్ కర్రె గట్టయ్య, కనుకుల గ్రామ సర్పంచ్ కర్రె కవిత కుమార్తో పాటు పలువురు వార్డు సభ్యులు, నాయకులు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ప్రభుత్వ విప్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా విజయరమణారావు మాట్లాడుతూ, సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి నుంచి కదంబాపూర్, కనుకుల గ్రామాల మీదుగా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి వరకు రూ.100 కోట్లతో చేపట్టనున్న తారు రోడ్డు నిర్మాణంతో పాటు గ్రామాల్లో అభివృద్ధి పనులను ఆశిస్తూ పలువురు కాంగ్రెస్‌లో చేరడం అభినందనీయమన్నారు.
గ్రామాల అభివృద్ధికి కొత్తగా చేరిన నాయకుల సేవలను వినియోగించుకుని ముందుకు సాగుతామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి మద్దతు లభిస్తోందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు డి. దామోదర్ రావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిలుక సతీష్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నామని రాజిరెడ్డి, పలువురు సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
