Suryapet | కాంగ్రెస్ నేతల మధ్య ఘ‌ర్ష‌ణ‌..

Suryapet | ఆంధ్రప్రభ, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సమాచారం ప్రకారం… కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్‌పై ఫిర్యాదు చేసేందుకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి వర్గీయులు ‘ఛలో గాంధీభవన్’ కార్యక్రమానికి బయలుదేరారు. ఈ క్రమంలో అర్వపల్లి మండల కేంద్రంలో వారి ఓ వాహనాన్ని ఎమ్మెల్యే సామేల్ అనుచరులు అడ్డుకున్నట్లు ఆరోపణలున్నాయి.

ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘటనలో పలువురు కాంగ్రెస్ నాయకులు గాయపడగా, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించిన పోలీసులకు కూడా గాయాలైనట్లు సమాచారం.

ఘర్షణ తీవ్రరూపం దాల్చడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ప్రస్తుతం అర్వపల్లి ప్రాంతంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.