పోలవరం వద్ద ఉరకలెత్తుతున్న గోదావరి.. కొట్టుకుపోయిన కాజ్‌వే

ఏలూరు బ్యూరో (ఆంధ్రప్రభ): ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో మంజీర, ప్రవర, ప్రాణహిత ఉపనదుల వరద జలాలు గోదావరిలో చేరడంతో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదను దృష్టిలో ఉంచుకుని జలవనరుల శాఖ అధికారులు స్పిల్‌వే 48 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

స్పిల్‌వే నుంచి భారీ ఉద్ధృతితో ప్రవహిస్తున్న వరద నీటి తాకిడికి స్పిల్‌ ఛానల్‌ మధ్యనున్న 902 హిల్ నుంచి మహా నందీశ్వర స్వామి ఆలయం వరకు వాహనాల రాకపోకల కోసం నిర్మించిన కాజ్‌వేకు గండి పడింది. దీంతో కాజ్‌వే తూములతో సహా వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. ప్రస్తుతం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యాం వద్ద 26.800 మీటర్లు, దిగువ కాఫర్ డ్యాం వద్ద 14.000 మీటర్లు, స్పిల్‌వే ఎగువన 26.690 మీటర్లు, స్పిల్‌వే దిగువన 18.000 మీటర్ల నీటిమట్టం నమోదైనట్లు అధికారులు తెలిపారు.