మెస్సీ మ్యాజిక్… వరల్డ్ కప్ క్వార్టర్స్ కు డిఫెండింగ్ ఛాంపియన్స్!

  • ఉత్కంఠ పోరులో ఈజిప్ట్‌పై అర్జెంటీనా ఘన విజయం..

ఆంధ్ర‌ప్ర‌భ : వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఊహించని రీతిలో అద్భుతమైన పునరాగమనం (Comeback) చేసింది. అట్లాంటాలోని మెర్సిడెస్-బెంజ్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో ఈజిప్ట్‌ను 3-2 తేడాతో ఓడించిన‌ అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మ్యాచ్ చేజారిపోతుందనుకున్న తరుణంలో స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ తన అసాధారణ ఆటతీరుతో అర్జెంటీనాను ఆదుకున్నాడు.

ఈజిప్ట్ సంచలనం.. మెస్సీ మ్యాజిక్

మ్యాచ్ ముగింపు దశకు చేరుకునే సమయానికి ఈజిప్ట్ జట్టు 2-0 ఆధిక్యంతో బలంగా నిలిచి అర్జెంటీనాకు షాక్ ఇచ్చింది. అయితే, 79వ నిమిషంలో మెస్సీ అందించిన అద్భుతమైన అసిస్ట్‌ను క్రిస్టియన్ రొమేరో గోల్‌గా మలిచి అర్జెంటీనా ఖాతా తెరిచాడు. ఆ తర్వాత కేవలం నాలుగు నిమిషాల వ్యవధిలోనే (83వ నిమిషంలో) మెస్సీ స్వయంగా మరో గోల్ సాధించి స్కోరును 2-2తో సమం చేశాడు. ఈ గోల్‌తో ప్రపంచకప్ నాకౌట్ చరిత్రలోనే వరుసగా ఆరో మ్యాచ్‌లో గోల్ సాధించిన ఆటగాడిగా మెస్సీ సరికొత్త రికార్డు సృష్టించాడు.

ఇంజూరీ టైమ్‌లో విన్నింగ్ గోల్!

ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ ఎక్స్‌ట్రా టైమ్‌కు దారితీస్తుందని అందరూ భావించారు. కానీ, ఇంజూరీ టైమ్ (రెండో నిమిషం) లో ఎంజో ఫెర్నాండెజ్ అద్భుతమైన హెడర్ ద్వారా బంతిని నెట్‌లోకి పంపి అర్జెంటీనాకు 3-2తో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

1958, 1962లో బ్రెజిల్ తర్వాత వరుసగా రెండుసార్లు ప్రపంచకప్ టైటిల్ గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించాలనే పట్టుదలతో ఉన్న అర్జెంటీనా.. శనివారం కాన్సాస్ సిటీలో జరగబోయే క్వార్టర్ ఫైనల్లో కొలంబియా లేదా స్విట్జర్లాండ్ విజేతతో తలపడనుంది.