సింగరేణి విస్తరణకు కీలక అడుగు
- సింగరేణికి తాడిచర్ల-2 బ్లాక్ గ్రీన్ సిగ్నల్
- ప్రజా ప్రభుత్వ కృషి ఫలించింది
- కేంద్రానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కృతజ్ఞతలు
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సింగరేణి అభివృద్ధి కోసం చేసిన నిర్విరామ కృషి ఫలితంగానే తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌ను సింగరేణి కాలరీస్ కంపెనీకి (ఎస్‌సీసీఎల్) కేటాయించినట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రకటించడం హర్షణీయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు.
తాడిచర్ల-2 బ్లాక్‌ను సింగరేణికి కేటాయించాలని కోరుతూ 2024 మార్చి 7న అప్పటి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని న్యూఢిల్లీలో కలిసి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అదే ఏడాది జూన్‌లో హైదరాబాద్‌లో జరిగిన బొగ్గు బ్లాక్‌ల వేలం సందర్భంగా, అనంతరం నవంబర్ 27న కూడా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని కలిసి ఇదే అంశాన్ని ప్రస్తావించినట్లు చెప్పారు.
అదేవిధంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి తాడిచర్లతో పాటు ఇతర బొగ్గు బ్లాక్‌లను సింగరేణికి కేటాయించాలని కోరినట్లు భట్టి గుర్తు చేశారు. ఇటీవల మే నెలలో ఢిల్లీ పర్యటన సందర్భంగా మరోసారి కేంద్ర బొగ్గు శాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. గత రెండేళ్లుగా ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగానే తాడిచర్ల-2 బ్లాక్‌ను సింగరేణికి కేటాయించారని, ఇది సంస్థ భవిష్యత్ అభివృద్ధికి కీలకమని అన్నారు. అలాగే సింగరేణి పరిధిలోని ఇతర బొగ్గు బ్లాక్‌లను కూడా సంస్థకే కేటాయించాలని కేంద్రాన్ని కోరారు.
గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్‌కు తమ ప్రభుత్వం పూర్తి అనుమతులు సాధించి బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించిందని పేర్కొన్నారు. తాడిచర్ల-2 బ్లాక్ కేటాయింపు కూడా సింగరేణి విస్తరణ పట్ల ప్రజా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున భట్టి విక్రమార్క కృతజ్ఞతలు తెలిపారు.
తాడిచర్ల-2 బ్లాక్ ప్రత్యేకతలు
-జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తాడిచర్ల ఓపెన్‌కాస్ట్-2 గని ఏర్పాటు కానుంది.
-మొత్తం 434.14 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉండగా, వాటిలో 340 మిలియన్ టన్నుల బొగ్గు వెలికితీసే అవకాశం ఉంది.
-ఏటా 10 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని ప్రణాళిక రూపొందించారు.
-నాణ్యమైన జీ-9 గ్రేడ్ బొగ్గు లభించనుంది.
-ప్రత్యక్ష, పరోక్షంగా 3 వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి.
-భూపాలపల్లి ప్రాంతంలో రహదారులు, రైల్వే, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి ఊతమివ్వనుంది.
-రాష్ట్ర పారిశ్రామిక, విద్యుత్ రంగాలకు దీర్ఘకాలిక బొగ్గు సరఫరా భద్రత లభించనుంది.
-సింగరేణి వార్షిక 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు ఈ బ్లాక్ కీలకంగా మారనుంది.

