‘హే రామ్’ నినాదం రాజకీయ స్టంట్ మాత్రమే
తెలుగు విద్యార్థి రాష్ట్ర అధికార ప్రతినిధి పొట్లూరు దర్శిత్
విజయవాడ, ఆంధ్రప్రభ : జగన్మోహన్ రెడ్డి వినిపిస్తున్న హే రామ్ నినాదం కేవలం రాజకీయ స్టంట్ మాత్రమేనని తెలుగుదేశం పార్టీ తెలుగు విద్యార్థి రాష్ట్ర అధికార ప్రతినిధి పొట్లూరు దర్శిత్ పేర్కొన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల ఆయన “హే రామ్ – సేవ్ ఆంధ్ర” నినాదాన్ని వినియోగించడం రాజకీయ అవసరాల కోసమేనని ఆరోపించారు.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం ధ్వంసమైన ఘటన, దేవాలయాలపై జరిగిన దాడులు, ప్రసాదాల అపవిత్ర ఘటనలపై సరైన స్పందన చూపలేదని దర్శిత్ విమర్శించారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు భగవంతుడి పేరును రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని అన్నారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిపై విశ్వాసం ఉందని డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సి వచ్చినప్పుడు తిరుమల పర్యటననే రద్దు చేసుకున్న వ్యక్తి ఇప్పుడు భక్తి గురించి మాట్లాడడం విశ్వసనీయంగా లేదని వ్యాఖ్యానించారు.
మహాత్మా గాంధీ బోధించిన సత్యం, అహింస సిద్ధాంతాలను గుర్తు చేసిన దర్శిత్, జగన్మోహన్ రెడ్డి మాత్రం అసత్య ప్రచారాలు, రాజకీయ ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు. గత ఐదేళ్ల పాలనలో హింసాత్మక రాజకీయాలకు పాల్పడి, కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేశారనే విషయాన్ని రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదని అన్నారు. దేవుడి పేరును రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించడం మానుకుని ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని జగన్మోహన్ రెడ్డికి సూచించారు.
