కన్నెపల్లి పంప్‌హౌస్‌ను వెంటనే ప్రారంభించాలి: బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ, ఆంధ్రప్రభ: కోదాడ నియోజకవర్గ పరిధిలోని మోతే మండలం రాఘవాపురం గ్రామంలో పంట కాలువలను మంగళవారం పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి పంప్‌హౌస్‌ను వెంటనే ప్రారంభించి రైతులకు సాగునీరు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన ధర్నాలో రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాల ప్రాధాన్యం, ముఖ్యంగా కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందిన విషయాన్ని ప్రజలకు వివరించినట్లు గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాలు తెలంగాణ వ్యవసాయ రంగానికి కీలకంగా నిలిచాయని పేర్కొన్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మరమ్మతులు, భద్రతా కారణాలను చూపుతూ పంప్‌హౌస్ ప్రారంభాన్ని ఆలస్యం చేస్తోందని విమర్శించారు. ఎస్ఆర్ఎస్పీ ఫేజ్-2 ద్వారా సాగునీరు అందించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే కీలక పాత్ర పోషించిందని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్ఆర్ఎస్పీ నుంచి కోదాడ వరకు సాగునీరు తీసుకురావడంతో పాటు చెరువుల పునరుద్ధరణ కూడా బీఆర్ఎస్ హయాంలో జరిగిందని తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా వెంటనే కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ప్రారంభించి సాగునీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
