విద్యార్థులకు ఉచిత కాపీరైటింగ్ పుస్తకాల పంపిణీ

దండేపల్లి, జూలై 7 (ఆంధ్రప్రభ): దండేపల్లి మండలంలోని పాతమామిడిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని దొరగారిపల్లి మండల ప్రాథమిక పాఠశాలలో మంగళవారం విద్యార్థుల విద్యాభివృద్ధి, చేతిరాత మెరుగుదల కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలకు సంబంధించిన కాపీరైటింగ్ పుస్తకాలను విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు. కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్ చిన్న నర్సయ్య, సీఆర్పీ సురేందర్ విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రాథమిక దశలోనే అక్షర దోషాలు లేకుండా అందమైన చేతిరాత అలవర్చుకోవడం విద్యార్థుల విద్యాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని తెలిపారు. విద్యార్థులు ఈ పుస్తకాలను సద్వినియోగం చేసుకుని ప్రతిరోజూ సాధన చేయాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మంజుల, ఉపాధ్యాయురాలు ఆదేశ్వరి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.