చోరీ యత్నం భగ్నం.. ఇద్దరు నిందితుల అరెస్ట్

  • మహిళ సమయస్ఫూర్తితో పోలీసులకు సమాచారం
  • వెంటనే స్పందించిన పోలీసులు

కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ: కర్నూలు నగరంలో చోరీకి యత్నిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు. రాత్రి వేళల్లో చేపడుతున్న విజిబుల్ పోలీసింగ్, గస్తీ విధులు మరోసారి ఫలితాన్నిచ్చాయి. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పట్టణంలో పోలీసులు విస్తృతంగా గస్తీ నిర్వహిస్తున్న క్రమంలో, గణేష్‌నగర్ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కాలనీలో తాళం వేసి ఉన్న ఇంట్లోకి ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు ప్రవేశించినట్లు స్థానిక మహిళ రాజేశ్వరి పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే స్పందించిన వన్‌టౌన్ సీఐ మారుతి శంకర్ నేతృత్వంలోని పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని ఇంటిని చుట్టుముట్టి, చోరీకి యత్నిస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుంది. పోలీసుల విచారణలో నిందితులు కర్నూలు బుధవారపేటకు చెందిన షేక్ ఖాజా, షేక్ ఆలం హుస్సేన్‌గా గుర్తించారు. అనంతరం వారిని తదుపరి చట్టపరమైన చర్యల కోసం త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.

ఈ ఘటనలో సమయస్ఫూర్తితో సమాచారం అందించిన రాజేశ్వరిని, అలాగే వేగంగా స్పందించి నిందితులను పట్టుకున్న వన్‌టౌన్ సీఐ మారుతి శంకర్, హెడ్ కానిస్టేబుల్ ధనరాజ్‌తో పాటు విధుల్లో పాల్గొన్న పోలీసు సిబ్బందిని జిల్లా పోలీసు అధికారులు అభినందించారు. కాలనీలు, నివాస ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలు కనిపించిన వెంటనే డయల్-112 లేదా డయల్-100కు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని జిల్లా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు