రెండు రోజుల్లో ధర్మాపూర్ బడికి కొత్త టీచర్

  • ఆంధ్రప్రభ వార్తకు స్పందించిన జిల్లా డీఈవో విజయ కుమారి
  • ప్రతి విద్యార్థికి చదువు ఎంతో అవసరం
  • బడి బయట పిల్లలు ఎవరైనా ఉంటే గ్రామస్తులు యువజన సంఘాల సభ్యులు బడిలో చేర్పించండి
  • అందరికీ విద్య అందరూ చదవాలి
  • మహబూబ్ నగర్‌ జిల్లా డీఈవో విజయ కుమారి

మహమ్మదాబాద్, ఆంధ్రప్రభ: ధర్మాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతపై విద్యార్థులు, తల్లిదండ్రులు చేసిన విజ్ఞప్తికి జిల్లా విద్యాశాఖ స్పందించింది. ఈ సమస్యపై సోమవారం ఆంధ్రప్రభలో ప్రచురితమైన కథనంతో పాటు మహబూబ్‌నగర్ జిల్లా డీఈవో విజయకుమారికి సమాచారం అందించగా, ఆమె వెంటనే స్పందించారు.

ధర్మాపూర్ పాఠశాల సమస్యపై ప్రజావాణిలో చర్చించామని, ప్రస్తుతం మహమ్మదాబాద్ మండల ఎంఈఓ సెలవులో ఉన్నారని తెలిపారు. ఆయన విధుల్లో చేరిన వెంటనే బుధవారం డిప్యూటేషన్‌పై ఒక ఉపాధ్యాయుడిని ధర్మాపూర్ పాఠశాలకు పంపిస్తామని డీఈవో హామీ ఇచ్చారు.

ప్రతి విద్యార్థికి విద్య ఎంతో అవసరమని, బడి బయట ఉన్న పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు గ్రామస్థులు, యువజన సంఘాలు సహకరించాలని కోరారు. ప్రభుత్వం ప్రతి విద్యార్థికి విద్య అందించేందుకు కట్టుబడి ఉందని, మారుమూల గ్రామాల్లోనూ ఉపాధ్యాయులను నియమించి విద్యాబోధన కొనసాగిస్తామని డీఈవో విజయకుమారి తెలిపారు.