ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
- ఎమ్మెల్యే, ఎంపీకి ఏపీ జేఏసీ వినతిపత్రం..
- 10 ప్రధాన డిమాండ్ల సాధనకు చర్యలు కోరుతూ విజ్ఞప్తి
బాపట్ల, ఆంధ్రప్రభ: ఏపీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల పెండింగ్ డిమాండ్ల సాధన కోసం బాపట్ల జిల్లా జేఏసీ నాయకులు సోమవారం ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ, సరెండర్ లీవుల చెల్లింపు, నాలుగు విడతల డీఏ బకాయిల విడుదల, ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణతో పాటు మొత్తం 10 ప్రధాన డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని వారు కోరారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా, తాలూకా జేఏసీ నాయకులు, పెన్షనర్స్ అసోసియేషన్, ట్రెజరీ శాఖ, స్టాఫ్ నర్సెస్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
