Mumbai Rains | ముంబైని ముంచెత్తాయి..

భారీ వ‌ర్షంతో అత‌లాకుత‌లం
జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్
పాల్ఘర్ జిల్లాలో రికార్డు స్థాయి వర్షాలు..
లోతట్టు ప్రాంతాలు జలమయం
ఎన్‌హెచ్-48పై వరద నీరు..
వాసాయి, విరార్ ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ముంబైతో పాటు పరిసర ప్రాంతాలను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), పాల్ఘర్ జిల్లాల్లో కుండపోత వర్షాల కారణంగా సాధారణ జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది. పలు ప్రాంతాలు జలమయమవడంతో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ముంబై–అహ్మదాబాద్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-48)పై మాస్టన్ నాకా, మనోర్, వరై ఫాటా ప్రాంతాల్లో కొండల నుంచి భారీగా వరద నీరు రహదారిపైకి చేరడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగి నదులను తలపిస్తున్నాయి.

పాల్ఘర్ జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవడంతో వాగోబా ఘాట్, కోల్గావ్ వంతెన, సఫాలే–తందుల్వాడి రహదారులపై వరద నీరు ప్రవహించింది. పలు చోట్ల చెట్లు కూలిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ పరిధిలోని వాసాయి, విరార్ ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. లోతట్టు కాలనీల్లోకి వరద నీరు చేరడంతో సహాయక బృందాలు రంగంలోకి దిగి వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.

ప్రస్తుతం కొనసాగుతున్న భారీ వర్షాల నేపథ్యంలో సంబంధిత ప్రాంతాల్లో అధికారులు రెడ్ అలర్ట్ కొనసాగిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రయాణాలను నివారించాలని ప్రజలకు సూచించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.