కుప్పం రైతులకు బంగారు భవిష్యత్..
- కుప్పం రైతులతో ఆత్మీయ సమావేశం
- ఐటీసీతో ఒప్పందం ద్వారా టమాటా, పండ్లు, కూరగాయలకు విస్తృత మార్కెట్
- రూ.10 వేల కోట్ల పెట్టుబడులతో కుప్పం అభివృద్ధికి కొత్త దిశ
- ఆధునిక వ్యవసాయానికి సీఎం చంద్రబాబు పిలుపు
కుప్పం, ఆంధ్రప్రభ : కుప్పం ప్రాంతాన్ని ఆధునిక వ్యవసాయం, ఆహార శుద్ధి పరిశ్రమలు, ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మూడు రోజుల కుప్పం పర్యటనలో భాగంగా ఆదివారం స్థానిక రైతులతో నిర్వహించిన ఆత్మీయ పలకరింపు సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో రైతులకు ప్రయోజనం కలిగేలా ఐటీసీ సంస్థతో కీలక ఒప్పందం కుదిరింది. అలాగే ఆధునిక వ్యవసాయ పద్ధతులు, విలువ ఆధారిత వ్యవసాయ శ్రేణుల అభివృద్ధి కోసం కాడాతో కలిసి విశాలాక్షి ఇన్నోవేషన్స్ సస్టెయినబుల్ వ్యాల్యూ చైన్ సంస్థతో మరో ఒప్పందం కూడా జరిగింది.
ఈ ఒప్పందాల ద్వారా కుప్పం ప్రాంతంలో పండే పండ్లు, కూరగాయలు, ఉద్యాన ఉత్పత్తులను క్లస్టర్ల రూపంలో సమీకరించి బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మహానగరాలకు మార్కెటింగ్ చేయడంతో పాటు ఎగుమతులకు కూడా అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.
రైతులకు మెరుగైన ధరలు లభించడంతో పాటు మధ్యవర్తులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుందని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు, సంప్రదాయ వ్యవసాయంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
అధిక దిగుబడి, తక్కువ ఖర్చు, మెరుగైన ఆదాయం సాధించాలంటే ఆధునిక వ్యవసాయ విధానాలే మార్గమని పేర్కొన్నారు. ఉత్పత్తి పెంచడమే కాకుండా మార్కెటింగ్‌పై కూడా రైతులు దృష్టి సారించాలని సూచించారు. నియంత్రిత వాతావరణంలో అత్యాధునిక సాంకేతికతతో 10 వేల టన్నుల టమాటాలను పండించి ఎగుమతి చేసే ప్రణాళికను ఐటీసీ సంస్థ సిద్ధం చేసిందని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని వెయ్యి ఎకరాల్లో అమలు చేయడానికి సంస్థ ముందుకు వచ్చిందన్నారు. ఈ పథకంలో ఆదర్శ రైతులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ ప్రాజెక్టు కోసం ఐటీసీ సంస్థ రూ.8 కోట్లతో అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
శీతల గిడ్డంగులు, గ్రేడింగ్, ప్యాకింగ్, రవాణా వంటి సదుపాయాలు ఏర్పడటంతో రైతులకు నాణ్యమైన మార్కెట్ లభిస్తుందని చెప్పారు. కుప్పం ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఏర్పడుతోందని పేర్కొన్న ముఖ్యమంత్రి, కోళ్ల పెంపకం, పాల ఉత్పత్తి, ఆహార శుద్ధి పరిశ్రమలు వంటి రంగాల్లో ఇప్పటికే భారీ పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు.
ఏబీఐఎస్, మదర్ డెయిరీ, ఐటీసీ వంటి ప్రముఖ సంస్థలు కుప్పంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం ఈ ప్రాంత అభివృద్ధికి శుభసూచకమని అన్నారు. కుప్పం నియోజకవర్గంలో రూ.10 వేల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు అమలు దశలో ఉన్నాయని వెల్లడించారు.
ప్రభుత్వం, ప్రైవేటు రంగాల భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా రూ.1 లక్ష కోట్ల మేర పెట్టుబడులతో అనేక ప్రాజెక్టులు చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తే, ప్రైవేటు రంగం ఆహార శుద్ధి పరిశ్రమలు, విలువ ఆధారిత వ్యవసాయ రంగాల్లో పెట్టుబడులు పెడుతుందని వివరించారు.
రాయలసీమ ప్రస్తుతం ఉద్యానవన పంటల సాగులో దేశంలోనే అగ్రస్థానానికి చేరుకుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని మరింతగా వినియోగించుకొని అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న పండ్లు, ఉద్యాన ఉత్పత్తుల సాగుపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు. ప్రపంచ మార్కెట్ల అవసరాలకు అనుగుణంగా పంటల సాగు చేస్తే రైతుల ఆదాయం గణనీయంగా పెరుగుతుందని చెప్పారు.
చిత్తూరు జిల్లా చిగురుగుంట ప్రాంతంలో బంగారం గని ఉన్నట్లు గుర్తించామని, దానిని వెలికితీసేందుకు త్వరలోనే చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కూడా జిల్లాకు కొత్త ఆర్థిక అవకాశాలను తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
చివరగా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఆధునిక వ్యవసాయ పరికరాలు, శాస్త్రీయ సాగు విధానాలు, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని కోరారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటల సాగు చేపట్టి, విలువ ఆధారిత వ్యవసాయంతో అధిక ఆదాయం సాధించాలని పిలుపునిచ్చారు. కుప్పం రాష్ట్రంలోనే ఆదర్శ వ్యవసాయ ప్రాంతంగా నిలిచేలా ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
