జర్నలిస్టుల హౌసింగ్ నిర్మాణం వెంటనే చేపట్టాలి…
- ముఖ్యమంత్రికి సీనియర్ జర్నలిస్టుల విజ్ఞప్తి..
విజయవాడ ఆంధ్రప్రభ : అమరావతి రాజధానిలో జర్నలిస్టుల హౌసింగ్ ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుని వివిధ పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలకు చెందిన సీనియర్ జర్నలిస్టులు కోరారు. ఆదివారం ఇక్కడ అమరావతి జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న పలువురు జర్నలిస్టులు ఈ మేరకు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2019లో జర్నలిస్టుల హౌసింగ్ నిర్మాణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎం ఎస్ నెంబర్ 67 ద్వారా 30 ఎకరాల భూమిని అమరావతి జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి కేటాయించింది. ఆ భూమిలో సిఆర్డీఏ ఆధ్వర్యంలో బహూళ అంతస్థుల గృహ సముదాయాలను నిర్మించేలా సొసైటీ అధికారికంగా ఒప్పందం చేసుకుని తిరిగి ఆ భూమిని ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది.
అందులో భాగంగా నాలుగు కేటగిరీలలో జర్నలిస్టులకు అపార్ట్మెంట్ లు నిర్మించేలా ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 107ను విడుదల చేసింది. హ్యాపీనెస్ట్ మోడల్ లో జర్నలిస్టుల కోసం అపార్ట్మెంట్ లు నిర్మిస్తామని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పుడు అమరావతిలో హ్యాపీనెస్ట్ తో పాటు అనేక ప్రాజెక్టులు నిర్మాణం జరుతున్నందున వెంటనే ప్రభుత్వం జర్నలిస్టుల హౌసింగ్ ప్రాజెక్ట్ ను కూడ ప్రారంభించాలని… ఇందుకు ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని సమావేశంలో పాల్గొన్న జర్నలిస్టులు అభ్యర్థిస్తూ
ఏకగ్రీవంగా తీర్మానించారు.
ఇతర తీర్మానాల్లో విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియచేయటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని పనులలో అనేక అవరోధాలను అధిగమిస్తూ వేగవంతంగా పూర్తి చేస్తుండటం పట్ల హర్షం వ్యక్తం చేయటం జరిగింది.
అమరావతిలో వివిధ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్న ఆయా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల యాజమాన్యాలను స్వాగతించటం జరిగింది. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల్లో నూతనంగా రాజధాని కోసం అవసరమైనంత భూమి సేకరించటంతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు భూమి కేటాయించడం, వివిధ వర్గాలతో పాటు జర్నలిస్టులకు గృహ నిర్మాణ సౌకర్యాలను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించడం అభివృద్ధిదాయకంగా భావిస్తున్నాం.
అమరావతిలో సొంత గృహాలను నిర్మించుకుంటున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుని మున్సిపల్ మంత్రి నారాయణని అభినందించటం జరిగింది. నిత్యం అమరావతి రాజధానితో అక్కడ జరిగే అభివృద్ది పనులతో మమేకమై పని చేస్తున్న జర్నలిస్టుల గృహనిర్మాణ నిమిత్తం గతంలో ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను సత్వరమే అమలు చేయాలని సమావేశం విజ్ఞప్తి చేసింది.
ఇందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని కోరటం జరిగింది. 2019లో అమరావతి జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి 30 ఎకరాలు భూమిని కేటాయించగా ఆ భూమిని తిరిగి ప్రభుత్వానికి అంటే సిఆర్డీఏకు ఇచ్చి నాలుగు కేటగిరీలలో బహూళ అంతస్తుల నివాస సముదాయాన్ని నిర్మించే విధంగా అధికారికంగా ఒప్పందం చేసుకోవటం జరిగింది.
ఇందుకు ప్రతిగా ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 107ను విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేసింది. ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహకారం ఆదేశాలతోనే జరిగింది. దీనిపై సత్వరమే ప్రభుత్వం స్పందించాల్సిన ఆవశ్యకతను వివరించటం జరిగింది. అమరావతిలో జర్నలిస్టుల కోసం ఉద్దేశించిన హౌసింగ్ ప్రాజెక్టును హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు మోడల్ లో నిర్మించాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశాన్ని గుర్తు చేసింది.
ఇప్పుడు హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు పనులు కూడ ప్రారంభమైనందున వెంటనే జర్నలిస్టుల హౌసింగ్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించాలని కోరింది. రాజధానిలో ఇప్పటికే పేదలకు 2000 ఇళ్ళ నివాస సముదాయాన్ని మధ్య తరగతి, ఆపై తరగతుల కోసం హ్యాపీనెస్ట్ ను, ఎన్ఆర్ఐల కోసం ఎపిఎన్ఆర్టీ అమరావతి ఐకాన్ ప్రాజెక్టులను నిర్మిస్తూ ఐఎఎస్ ఐపిఎస్ అధికారులకు ఇళ్ళ స్థలాలను కేటాయించిన ప్రభుత్వం జర్నలిస్టుల విషయంలో కూడ అదే సమన్యాయంతో సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేసింది.
2019-2024 మధ్యకాలంలో అనేక మంది జర్నలిస్టులు పదవీ విరమణ చెందటం, కరోనా సమయంలో మరణించటం జరిగిందని వారందరూ గతంలో హౌసింగ్ ప్రాజెక్టులో భాగస్వాములైనందున ఇప్పుడు ఆ కుటుంబాలు కూడ ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నాయని తెలిపింది. ప్రజా రాజధానిగా అమరావతి అభివృద్ధి చెందడంలో జర్నలిస్టుల పాత్ర విస్మరించలేనిదని ఆర్థికంగా దిగువశ్రేణిలో ఉన్న వారి జీవితానికి ఎంతో ముఖ్యమైన గృహ నిర్మాణ కలను సాకారం చేయాలని ముఖ్యమంత్రికి సమావేశం ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసింది. ప్రపంచశ్రేణి రాజధాని నిర్మిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచలో మరెక్కడా లేని విధంగా గొప్ప జర్నలిస్టు కాలనీ నిర్మించాలనేది మా ఆకాంక్ష.
సమావేశంలో పాల్గొన్న వారిలో అమరావతి జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ కార్యదర్శి పాటిబండ్ల నాగశ్రీనివాసరావు, డైరెక్టర్లు చావా రవి, ఈశ్వర్ (టివి -9) నరసింహరావు ( హెచ్ ఎం టివి), శ్రీనివాసే ( మహాటివి), హిందూ డిప్యూటీ ఎడిటర్ శ్రీనాధ్, స్పెషల్ కరస్పాండెంట్ సాంబశివరావు, ఇండియన్ ఎక్స్ ప్రెస్ డిప్యూటీ రెసిడెంట్ ఎడిటర్ మల్లేశ్వరరావు, సీనియర్ సబ్ ఎడిటర్ అమీన్, ఈనాడు సీనియర్ రిపోర్టర్ ఎం శ్రీనివాసరావు, ఈటీవీ బ్యూరోచీఫ్ శ్రీనివాస మోహన్, ఆంధ్రప్రభ బ్యూరో చీఫ్ గోపీ, బిబిసి ఇన్ ఛార్జి జి ఉమాకాంత్, టైమ్స్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ ఎడిటర్ శ్రీకాంత్, ఎన్టీవి చీఫ్ రిపోర్టర్ ప్రసన్న, మహాటివి ఏపి బ్యూరోచీఫ్ మురళీమోహన్, విశాలాంధ్ర మాజీ ఉపసంపాదకుడు ఎస్ కె బాబు, దిశ సీనియర్ జర్నలిస్ట్ దారం వెంకటేశ్వరరావు, సివిల్ ఆర్ టీవీ బ్యూరో ఏడుకొండలు, సహకార భూమి ఎడిటర్ అక్బర్ పాషా, ఆంధ్రభూమి మాజీ న్యూస్ ఎడిటర్ నరసింహారావు, 99 టివి కొండల రావు వార్త బ్యూరో చీఫ్ గంటా విజయ్ కుమార్, పయినీర్ ఇన్చార్జి బొప్పన రవి, ప్రజాశక్తి స్టేట్ బ్యూరో పవన్, డెక్కన్ క్రానికల్ మాజీ బ్యూరో ఇన్చార్జి కృష్ణారావు, ఫోటోగ్రాఫర్లు దయానంద్, వెంకట్రామయ్య, ఆంధ్రపత్రిక సిఇవో మాధవ్, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్టు శ్రీధర్ తదితరులు హాజరవ్వగా మరి కొంతమంది జర్నలిస్టులు సందేశాలు తమ సంఘీభావాన్ని తెలిపారు.
