ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యం

భీంగల్ ( ఆంధ్రప్రభ ): ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రతి వైద్య సంస్థ బాధ్యత అని రిటైర్డ్ డీఎండీహెచ్వో, నిరుపేదల డాక్టర్‌గా పేరుపొందిన డా. బసంత్ రెడ్డి అన్నారు. భీంగల్ పట్టణంలో ప్రముఖ వ్యాపారవేత్త ముత్యం సుదర్శన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ నిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఆదివారం ఆయన ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలు మెరుగైన వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా భీంగల్‌లోనే ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. ఆసుపత్రిలో అనుభవజ్ఞులైన వైద్యుల సేవలు, ఆధునిక వైద్య పరికరాలతో అత్యవసర చికిత్సలు, సాధారణ వైద్య సేవలు, పలు ప్రత్యేక విభాగాల సేవలను అందించాలని సూచించారు. రోగుల పట్ల మానవత్వంతో వ్యవహరిస్తూ నమ్మకమైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి యాజమాన్యానికి సూచించారు.

ఆసుపత్రి నిర్వాహకులు ముత్యం సుదర్శన్, ముత్యం సంతోష్ మాట్లాడుతూ, భీంగల్‌తో పాటు పరిసర గ్రామాల ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ ఆసుపత్రిని ప్రారంభించినట్లు తెలిపారు. తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మల్లెల లక్ష్మణ్, టౌన్ అధ్యక్షులు పర్శ అనంత్ రావు, కౌన్సిలర్లు సతీష్, సందీప్,అంజూమ్, సంగ్య నాయక్,, రత్నం స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్యులు, వ్యాపారవేత్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.