Missing Fishermen | జాలర్ల కోసం ఆపరేషన్..
Missing Fishermen | జాలర్ల కోసం ఆపరేషన్..
గాలింపు చరల్యు ముమ్మరం
రంగంలో కోస్టుగార్డు.. నేవీ
హెలికాప్టర్లు చక్కర్లు
ఏపీ సీఎం తక్షఱ ఆదేశం
( విశాఖపట్నం, ఆంధ్రప్రభ బ్యూరో)
Missing Fishermen | సముంద్రంలో గల్లంతైన జాలర్లను రక్షించేందుకు గాలింపు చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. కోస్టుగార్డు, నేవీ, మెరైన్ పోలీసు విభాగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఆదివారం ఉదయం నుంచి నేవీ హెలికాప్టర్లు కూడా రంగంలోకి దిగాయి. ఇప్పటికే ఏసీ సర్కారు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు.
విశాఖ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారులను రక్షించేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సముద్రంలో మత్య్సకారుల గల్లంతయ్యారన్న విషయం తెలిసిన వెంటనే ఆయన కుప్పం నుంచి ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. బంగాళాఖాతంలో గల్లంతైన మత్స్యకారుల బోటును గాలించేందుకు కోస్టుగార్డు నౌక ప్రయత్నిస్తోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి INDAP-VS-MM-83 అనే బోటు 7గురు మత్స్యకారులతో జూన్ 1 తేదీ సాయంత్రం 4 గంటలకు సముద్రంలోకి చేపల వేటకు బయల్దేరి వెళ్లిందని సీఎంకు అధికారులు తెలిపారు.

4 తేదీ మధ్యాహ్నానికి ఆ బోటు ఫిషింగ్ హార్బర్ కు తిరిగి రావాల్సి ఉందని అయితే సాంకేతిక కారణాల వల్ల ఆ బోటు ఇప్పటికీ తిరిగి రాలేదని వివరించారు. గంగవరం సముద్ర తీరం సమీపంలో వారి బోటుకు సాంకేతిక సమస్య ఉత్పన్నమైనట్టుగా గుర్తించామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఇవాళ ఉదయం నుంచి నౌకాదళానికి చెందిన హెలికాప్టర్ల ద్వారా కూడా గాలింపు చర్యలు ప్రారంభించినట్టు తెలిపారు. ప్రస్తుతం కోస్టుగార్డు, నేవీ, మెరైన్ పోలీసు విభాగాలు గాలింపు చర్యలు చేపట్టినట్టు అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం సముద్రంలో చేపడుతున్న గాలింపు చర్యలను సమన్వయం చేసుకోవాల్సిందిగా మెరైన్ ఐజీ, విశాఖ సీపీలను ఆదేశించారు. గాలింపు చర్యలకు సంబంధించిన అంశాలను తనకు ఎప్పటికప్పుడు తెలియచేయాలని సీఎం సూచించారు. మత్స్యకారుల కుటుంబాలకు ధైర్యం చెప్పాలని మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక విశాఖ ప్రజాప్రతినిధులకు సీఎం ఆదేశాలిచ్చారు.
