పెద్దపల్లిలో మరోసారి దొంగల బీభత్సం
మూడు ఇళ్లలో చోరీకి యత్నం..
వరుస ఘటనలతో ప్రజల్లో భయాందోళన
పెద్దపల్లి, (ఆంధ్రప్రభ): పెద్దపల్లి పట్టణంలో వరుస దొంగతనాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మున్సిపల్ పరిధిలోని 24వ వార్డు పాత కోర్టు సమీపంలో దొంగలు రెచ్చిపోయి మూడు ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. భారత్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయం తాళం పగులగొట్టి చోరీకి యత్నించినట్లు సమాచారం. ఈ ఘటనలో తాళం పగులగొట్టే క్రమంలో దొంగలకు గాయమై రక్తపు మరకలు కూడా లభ్యమైనట్లు తెలుస్తోంది. కొన్ని ఇళ్లలో సామాగ్రి దొంగిలించగా, మరికొన్ని చోట్ల వస్తువులు అక్కడే వదిలేసినట్లు గుర్తించారు.
సమాచారం అందుకున్న పట్టణ ఎస్ఐ కె. నరేష్ సిబ్బందితో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. వరుసగా రెండు రోజులుగా దొంగతనాలు జరుగుతుండటంతో పట్టణంలో ఆందోళన నెలకొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు.
