KTR | కేటీఆర్ కాళేశ్వరం పర్యటన ఉద్రిక్తం

స్థానిక బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
అరెస్టులను ఖండించిన పార్టీ నేతలు..
రైతులకు సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్

KTR | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ కన్నేపల్లి పర్యటనకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు వస్తున్న సందర్భంగా జనగామ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. అలాగే జిల్లా నాయకుల ఇండ్ల వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో పలువురు స్థానిక బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. 66వ డివిజన్ అధ్యక్షుడు పాపిశెట్టి శ్రీధర్, 1వ డివిజన్ అధ్యక్షుడు నరెడ్ల శ్రీధర్, 55వ డివిజన్ అధ్యక్షుడు అటికం రవీందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు, కేటీఆర్ చేపట్టిన కాళేశ్వరం పర్యటన ఉద్దేశం గోదావరి జలాలను ఎత్తిపోసి రైతులకు సాగునీరు అందించాలనే డిమాండ్‌ను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమేనని పేర్కొన్నారు. అలాంటి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ముందస్తు అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆరోపించారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకే పోలీసులు వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. అరెస్టులతో తమ ఉద్యమాన్ని అణచివేయలేరని, రైతుల సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు, శాంతిభద్రతల పరిరక్షణ, అవాంఛనీయ ఘటనలు జరగకుండా నివారించేందుకే ముందస్తు చర్యల్లో భాగంగా కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. కాళేశ్వరం పర్యటన సందర్భంగా పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.