ఆస్పత్రుల్లో వైద్యుల కొరతతో శస్త్రచికిత్సలకు ఆటంకం
టిమ్స్‌కు సీనియర్ వైద్యుల డిప్యుటేషన్
ఉస్మానియా, గాంధీల్లో శస్త్రచికిత్సలు వాయిదా
నిమ్స్‌పైనా డిప్యుటేషన్ ప్రభావం
నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది కొరత
సీనియర్ వైద్యుల డిప్యుటేషన్ ఉస్మానియా, గాంధీల్లో కీలకమైన శస్త్రచికిత్సలు వాయిదా వైద్యులు లేక రోగుల అవస్థలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : నగరంలోని ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులు నిరుపేదలకు వరం లాంటివి. ఇక్కడకు నిత్యం వేల మంది రోగులు వివిధ సమస్యల పరిష్కారం కోసం వస్తుంటారు. ఆరు రాష్ట్రాలకు చెందిన రోగులు ఈ రెండు ఆసుపత్రులను నమ్ముకొని వైద్యం కోసం సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. అంతటి కీలకమైన ప్రధాన ఆసుపత్రుల్లో పని చేసే వైద్యులను సనత్‌నగర్ తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)కు డిప్యుటేషన్‌పై పంపించారు. దీంతో ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో నిరుపేదలకు అత్యవసర వైద్య సేవలకు అడ్డంకిగా మారింది. ఫలితంగా ఈ రెండు ఆసుపత్రుల్లో నిర్వహించే శస్త్రచికిత్సలను వాయిదా వేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు సకాలంలో వైద్యం అందకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు.
మొత్తం 180 మంది నిపుణులు, సీనియర్ రెసిడెంట్ వైద్యులను టిమ్స్‌కు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఉస్మానియాలో 80 మంది వైద్యుల్లో 34 మంది కీలక విభాగాల్లో నిపుణులే. మిగతా 46 మంది సీనియర్ రెసిడెంట్లు. ఇక నుంచి వీరంతా టిమ్స్‌లో వైద్య సేవలు అందించనున్నారు.
ఇప్పటికే న్యూరోసర్జరీ, గ్యాస్ట్రోఎంటరాలజీలో రోగుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. ప్రమాద కేసుల్లో బాధితుల తలకు దెబ్బలు తగిలితే అత్యవసరంగా సర్జరీ చేయాలి. గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో అడపాదడపా కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తున్నారు. సీనియర్ వైద్యులు టిమ్స్‌కు వెళ్లనుండటంతో ఇక నుంచి ఈ తరహా సర్జరీలు నిలిచిపోనున్నాయి.
ఆర్థోపెడిక్స్‌లో 300 వరకు మోకీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు చేశారు. ఇక్కడి నుంచి సీనియర్ వైద్యులు వెళ్లనుండటంతో ఈ సేవలు అందడం కష్టంగా మారనుంది. గాంధీలో న్యూరోసర్జరీ సేవలపై కూడా ప్రభావం పడనుంది.
నిమ్స్‌లోనూ ఇదే పరిస్థితి
నిమ్స్ కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగం నుంచి సీనియర్ వైద్యులను సనత్‌నగర్ టిమ్స్‌కు పంపడంతో అక్కడా ప్రభావం తప్పదని అంటున్నారు. తగినంత మంది ప్రొఫెసర్లు లేకపోతే మెడికల్ సీట్ల సంఖ్యను కూడా తగ్గించే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఆసుపత్రి నడవాలంటే వైద్యుల్లాగే పారామెడికల్ సిబ్బంది సేవలు కీలకం. సర్జరీలు, ఇతర చికిత్సల తర్వాత సేవలు పకడ్బందీగా అందాలన్నా, సకాలంలో పరీక్షల నివేదికలు రావాలన్నా వీరిదే కీలక పాత్ర.
గాంధీ, ఉస్మానియాలో రోగుల తాకిడితో నర్సులు, స్టాఫ్ నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది అవసరం రెండింతలు పెరిగింది. తాజాగా టిమ్స్‌కు గాంధీ, ఉస్మానియాల నుంచి నర్సింగ్ సిబ్బందిని గరిష్ఠ స్థాయిలో కేటాయించారు. ఉస్మానియా నుంచే 40 శాతం మంది పంపారు.
కొత్త నియామకాలు చేపట్టే వరకు ఉన్న వారితోనే సర్దుబాటు చేసుకోవాలంటే కష్టమేనని కొందరు వైద్యులు పేర్కొంటున్నారు. ప్రధానంగా సోమ, మంగళ, బుధవారాల్లో ఈ రెండు ఆసుపత్రులకు రోగుల తాకిడి ఎక్కువ. రెండు ఆసుపత్రులకు కలిపి 5 నుంచి 6 వేల మంది ఓపీ ఉంటోంది. ఒక వార్డులో ఒకరిద్దరు నర్సులతోనే సరిపెట్టడం వల్ల రోగులపై పర్యవేక్షణ గాడి తప్పుతోంది.
