జిల్లా అభివృద్ధికి రెండేళ్లుగా కలెక్టర్ వెంకటేశ్వర్ సేవలు
- అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతికి ప్రత్యేక ప్రాధాన్యం
- వైద్యం, విద్య, ప్రజా సేవల్లో వినూత్న కార్యక్రమాల అమలు
- ప్రజలకు చేరువైన పరిపాలనతో జిల్లా అభివృద్ధికి కృషి
- రెండేళ్ల సేవలు పూర్తి చేసుకున్న కలెక్టర్‌కు అభినందనల వెల్లువ
తిరుపతి, ఆంధ్రప్రభ: తిరుపతి జిల్లా కలెక్టర్‌గా ఎస్. వెంకటేశ్వర్ ఐఏఎస్ రెండేళ్ల పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ప్రజాకేంద్రిత పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాల సమర్థ అమలు, పారదర్శక పాలనతో జిల్లా పరిపాలనలో ప్రత్యేక గుర్తింపు పొందారు. 2024 జూలై 4న బాధ్యతలు స్వీకరించిన ఆయన పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహం, వైద్యం–విద్య రంగాల అభివృద్ధి, ప్రజా సమస్యల సత్వర పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు. రెండేళ్ల సేవలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయనను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.
పారిశ్రామిక, వైద్య రంగాలకు ఊతం
జిల్లాలో పెట్టుబడులను ఆకర్షించడం, పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం కల్పించడం, వేగవంతమైన అనుమతుల మంజూరుతో పారిశ్రామిక అభివృద్ధికి కలెక్టర్ ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. అలాగే రుయా ఆస్పత్రిలో నూతన భవనాలు, అదనపు పడకల ఏర్పాటు, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య శిబిరాల నిర్వహణ వంటి చర్యల ద్వారా వైద్య సేవలను మరింత బలోపేతం చేశారు.
విద్యా రంగంలో వినూత్న కార్యక్రమాలు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు పెంచేందుకు 36 మండలాల్లో ‘బడి పిలుస్తుంది’ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్హత కలిగిన ఉపాధ్యాయుల నియామకం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం సమర్థ అమలు, పాఠశాలల సౌకర్యాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి చర్యలతో గత ఏడాదితో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో 10 వేలకుపైగా విద్యార్థుల చేరికలు పెరిగేలా కృషి చేశారు.
ప్రజలకు చేరువైన పరిపాలన
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించి, సంబంధిత శాఖలతో సమన్వయం చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల వారీగా పర్యటిస్తూ ప్రభుత్వ సేవల అమలును పర్యవేక్షించడం, ప్రజలకు అవసరమైన సౌకర్యాలను అందుబాటులో ఉంచడం ద్వారా పరిపాలనను మరింత ప్రజలకు చేరువ చేశారు.
సమగ్ర అభివృద్ధే లక్ష్యం
యువతకు ఉపాధి అవకాశాలు, మహిళల ఆర్థిక సాధికారత, నైపుణ్యాభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమర్థ అమలుపై దృష్టి సారిస్తూ జిల్లాను అభివృద్ధి దిశగా ముందుకు నడిపిస్తున్నారు. సమర్థవంతమైన నాయకత్వంతో రెండేళ్ల సేవలు పూర్తి చేసుకున్న కలెక్టర్ వెంకటేశ్వర్‌కు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అభినందనలు తెలిపారు.
