రైతుల కళ్లలో సంతోషం నింపిన రైతు భరోసా: నిర్మలా జగ్గారెడ్డి
సంగారెడ్డి ప్రతినిధి, జూలై 4 (ఆంధ్రప్రభ): రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసి వారి కళ్లలో సంతోషం నింపిందని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. శనివారం సంగారెడ్డి పట్టణంలోని ఐబీ ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజాపాలనలో రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చే లక్ష్యంతో రైతు భరోసా నిధుల విడుదల రైతాంగానికి పెద్ద ఊరటనిచ్చిందని పేర్కొన్నారు. వ్యవసాయ పనులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోందని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతు సంక్షేమానికి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, రైతు అనుకూల నిర్ణయాలు వ్యవసాయ రంగానికి కొత్త ఊపునిస్తున్నాయని నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్, మున్సిపల్ చైర్పర్సన్ కూన వనిత, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
