రాయలసీమ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా?

జగన్‌కు గుడిసె ఆది కృష్ణమ్మ సవాల్

కర్నూలు, ఆంధ్రప్రభ: రాయలసీమ అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో జరిగిన పనులు, 2019–2024 మధ్య మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి సవాల్ విసిరారు.

కర్నూలులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రాయలసీమ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాయలసీమలో పారిశ్రామికాభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు, ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు.

ఇందులో భాగంగానే కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లిలో రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులకు ఇటీవల పూజా కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. ఈ ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేయడానికి తొలి దశలో రూ.4,500 కోట్లు, రెండో దశలో రూ.11,850 కోట్ల పెట్టుబడులు ప్రతిపాదించారని తెలిపారు. ఈ పరిశ్రమ ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, దక్షిణ భారతదేశంలో తక్కువ కార్బన్ ఉద్గారాలతో ఉక్కు ఉత్పత్తి చేసే ఆధునిక పరిశ్రమగా ఇది నిలుస్తుందని అన్నారు.

మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తన పాలనలో రాయలసీమ స్టీల్ ప్లాంట్‌ను పూర్తి చేస్తానని హామీ ఇచ్చి, రెండు సార్లు శంకుస్థాపనలు చేసినప్పటికీ ఐదేళ్లలో ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి సాధించలేదని విమర్శించారు. స్టీల్ ప్లాంట్‌కు కనీసం ప్రహరీ గోడ కూడా నిర్మించలేదని ఆరోపించారు.

రాయలసీమలో సాగు, తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని తెలిపారు. హంద్రీ-నీవా విస్తరణతో పాటు తుంగభద్ర, గోరకల్లు, శ్రీశైలం తదితర సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులకు నిధులు మంజూరు చేసి ప్రాంతీయ అభివృద్ధికి చర్యలు చేపట్టిందన్నారు.

చంద్రబాబు నాయుడు హయాంలో కర్నూలు, అనంతపురం, తిరుపతి జిల్లాలకు పలు పరిశ్రమలు తీసుకురావడంతో పాటు రాయలసీమ పారిశ్రామికాభివృద్ధికి పునాది వేశారని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం లేకపోవడంతో అమర్‌రాజా వంటి సంస్థలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయని ఆరోపించారు.

రాజధాని అంశంపై కూడా స్పందించిన ఆది కృష్ణమ్మ, అమరావతినే రాష్ట్ర ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు.

ఈ సమావేశంలో పార్టీ నాయకులు ఆకుపోగు ప్రభాకర్, కైపా పద్మలతారెడ్డి, వై. నాగేశ్వరరావు యాదవ్, మీన్నప్ప, సత్రం రామకృష్ణుడు, హనుమంతరావు చౌదరి, పి. రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.