Cotton Seeds | ‘మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ’ పథకం గురించి తెలుసా?

Cotton Seeds | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్; పత్తి సాగులో దిగుబడులు పెంచడం, సాగు ఖర్చులను తగ్గించడం, అధిక సాంద్రత సాగును ప్రోత్సహించడం లక్ష్యంగా ప్రభుత్వం మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ 2026–27 పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఎంపికైన రైతులకు నాణ్యమైన పత్తి విత్తనాలను ఒక్కో ప్యాకెట్‌ను కేవలం రూ.1 నామమాత్రపు ధరకే అందజేస్తున్నారు. దీంతో చిన్న, సన్నకారు రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి రావడంతో పాటు ఆధునిక సాగు విధానాలను ప్రోత్సహించే అవకాశం ఏర్పడుతోంది.

ఈ పథకంలో భాగంగా వ్యవసాయ శాఖ ప్రతి జిల్లాలో ప్రదర్శన క్షేత్రాలను ఏర్పాటు చేస్తోంది. ఎంపికైన రైతులకు విత్తనాలతో పాటు సాగు పద్ధతులపై సాంకేతిక సూచనలు, పంట నిర్వహణపై వ్యవసాయ అధికారుల నుంచి మార్గదర్శకత్వం అందిస్తున్నారు. పంట పెరుగుదల నుంచి కోత వరకు అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నారు.

పథకం ఎలా అమలవుతోంది?

మండలాల వారీగా అర్హులైన రైతులను ఎంపిక చేసి రాయితీపై విత్తనాలను పంపిణీ చేస్తున్నారు. ప్రధానంగా మూడు విధానాల్లో పత్తి సాగును ప్రోత్సహిస్తున్నారు. అధిక సాంద్రత, ఎకరానికి 6 ప్యాకెట్ల విత్తనాలు అందజేస్తారు. తక్కువ దూరంలో ఎక్కువ మొక్కలు నాటి దిగుబడిని పెంచడం దీని లక్ష్యం.
క్లోజర్ స్పేసింగ్ విధానం: వరుసలు, మొక్కల మధ్య దూరాన్ని తగ్గించి సాగు చేసే విధానం. దీనికి ఎకరానికి 4 ప్యాకెట్ల విత్తనాలు ఇస్తారు.
ప్రదర్శన క్షేత్రాలుఫ: ఎంపిక చేసిన రైతుల పొలాల్లో శాస్త్రీయ సాగు పద్ధతులను ప్రదర్శిస్తూ ఇతర రైతులకు అవగాహన కల్పిస్తారు.

రైతులకు కలిగే ప్రయోజనాలు

ఈ పథకం ద్వారా రైతులకు నాణ్యమైన ధృవీకరించిన విత్తనాలు అత్యల్ప ధరకు లభిస్తాయి. శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేయడం వల్ల ఎకరాకు మొక్కల సంఖ్య పెరిగి, దిగుబడి మెరుగుపడే అవకాశం ఉంటుంది. వ్యవసాయ అధికారుల పర్యవేక్షణతో పురుగు, తెగుళ్ల నియంత్రణ, ఎరువుల వినియోగం, నీటి నిర్వహణపై సరైన సలహాలు అందుతాయి. ఫలితంగా ఉత్పత్తి వ్యయం తగ్గి, ఆదాయం పెరగడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం.

ఎవరికి వర్తిస్తుంది?

పత్తి సాగు చేసే అర్హులైన రైతులను వ్యవసాయ శాఖ ఎంపిక చేస్తుంది. ఆయా మండల వ్యవసాయ కార్యాలయాల్లో నమోదు చేసుకున్న రైతులకు స్థానిక పరిస్థితులు, లక్ష్యాల ఆధారంగా విత్తనాల పంపిణీ జరుగుతుంది. ప్రతి మండలానికి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేస్తారు. మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ పథకం కేవలం విత్తనాల పంపిణీకే పరిమితం కాదు. శాస్త్రీయ సాగు విధానాలను రైతులకు చేరవేసి, పత్తి దిగుబడిని పెంచడం, సాగును లాభసాటిగా మార్చడం దీని ప్రధాన లక్ష్యం. ఒక్క రూపాయికే నాణ్యమైన విత్తనాలు అందించడం ఈ పథకంలో రైతులకు లభిస్తున్న ముఖ్యమైన ప్రయోజనం..