Telegram Piracy | పైరసీ కంటెంట్‌ను వెంటనే తొలగించాలని ఆదేశాలు..
Telegram Piracy |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: పైరసీ కంటెంట్ వ్యాప్తిని అరికట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌కు కఠిన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ప్లాట్ఫామ్లో చట్టవిరుద్ధంగా ప్రసారం అవుతున్న పైరేటెడ్ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, ఓటీటీ కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని సూచించింది. అలాగే ఈ అంశంపై తీసుకున్న చర్యలపై 15 రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రియేటర్ ఎకానమీ, చిత్ర పరిశ్రమ, ఓటీటీ వేదికలు, బ్రాడ్కాస్టర్లు, నిర్మాతలు, పంపిణీదారులను డిజిటల్ పైరసీ నుంచి రక్షించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు విడుదలైన కొద్ది గంటల్లోనే టెలిగ్రామ్ ఛానెళ్ల ద్వారా పైరసీకి గురవుతున్నాయని పరిశ్రమ వర్గాలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, ఇటీవల నీట్-యూజీ 2026 పునఃపరీక్ష సందర్భంగా అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ టెలిగ్రామ్‌పై తాత్కాలిక ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టెలిగ్రామ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం చట్టబద్ధ అధికారాలను వినియోగించిందని పేర్కొంటూ కోర్టు ప్రభుత్వ చర్యలను సమర్థించింది.
మరోవైపు, మెటా యాజమాన్యంలోని వాట్సాప్ ప్రతిపాదించిన ‘యూజర్‌నేమ్’ ఫీచర్‌పైనా కేంద్రం దృష్టి సారించింది. ఈ ఫీచర్‌పై సంప్రదింపులు పూర్తయ్యే వరకు భారత్‌లో అమలు చేయవద్దని సూచించినట్లు సమాచారం. దీనిపై స్పందించిన వాట్సాప్, యూజర్‌నేమ్ ఫీచర్ పూర్తిగా ఐచ్ఛికమేనని, నకిలీ ఖాతాలు, మోసాలను అరికట్టేందుకు తగిన భద్రతా చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వానికి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.
