జ్యువెలరీ దుకాణాల్లో పోలీసుల భద్రతా తనిఖీలు

సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి: ఎస్‌ఐ జాడి శ్రీధర్

క్యాతన్‌పల్లి, ఆంధ్రప్రభ: రామకృష్ణాపూర్ పట్టణంలోని జ్యువెలరీ దుకాణాల్లో పోలీసులు శనివారం భద్రతా తనిఖీలు నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఐపీఎస్, మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, మందమర్రి సీఐ రమేష్ ఆదేశాల మేరకు రామకృష్ణాపూర్ ఎస్‌ఐ జాడి శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ పలు జ్యువెలరీ షాపులను సందర్శించి, అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు, రికార్డింగ్ సామర్థ్యం, కవరేజీ తదితర అంశాలను పరిశీలించారు. ప్రతి జ్యువెలరీ షాపులో నాణ్యమైన సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, అవి 24 గంటల పాటు సక్రమంగా పనిచేసేలా నిర్వహించాలని దుకాణ యజమానులకు సూచించారు. డీవీఆర్ రికార్డింగ్‌ను సురక్షితంగా భద్రపరచాలని కూడా తెలిపారు.

దుకాణాల వద్దకు అనుమానాస్పద వ్యక్తులు వస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని, జ్యువెలరీ వ్యాపారులు పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ శ్రీధర్ సూచించారు. పట్టణంలో చోరీలు, దోపిడీలు నివారించేందుకు ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ తనిఖీలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.