బాసర ఆలయ పునర్నిర్మాణ పనులకు ప్రత్యేక పూజలు..
బాసర, ఆంధ్రప్రభ : సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
శ్రీ శృంగేరి జగద్గురువుల ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పునర్నిర్మాణ పనుల ప్రారంభానికి ముందు అమ్మవారి ఉత్సవమూర్తులను బాలాలయంలో ప్రతిష్ఠించే ప్రక్రియలో భాగంగా కళాపకర్షణ పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా గోపూజ, గణపతి పూజ, పుణ్యాహవాచనం, ఋత్విగ్వరణం, నవగ్రహ బ్రహ్మకలశ స్థాపన, అగ్ని ప్రతిష్ఠ తదితర వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఈ పూజా కార్యక్రమంలో ప్రధాన ఆలయ దాత సూరపనేని సునంద దంపతులు, ఆలయ వ్యవస్థాపక వంశీయులు శరత్ పాఠక్, ఆలయ ఈవో అంజనీదేవి, స్థానాచార్యులు, ప్రధాన అర్చకులు ప్రవీణ్ పాఠక్, ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి, వైదిక బృందం, శృంగేరి పండితులు పాల్గొన్నారు.
