Terrorists | జైష్, లష్కర్ నేతలపై కేంద్రం ఉక్కుపాదం
Terrorists | జైష్, లష్కర్ నేతలపై కేంద్రం ఉక్కుపాదం
Terrorists |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) కేంద్రంగా భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్న 23 మందిని కేంద్ర ప్రభుత్వం చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద వ్యక్తిగత ఉగ్రవాదులుగా ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ జాబితాలో 17 మంది పాకిస్థాన్ పౌరులు, ఆరుగురు భారతీయులు ఉన్నారు. వీరంతా ప్రస్తుతం పాకిస్థాన్, పీవోకే నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉగ్రదాడుల ప్రణాళికలు, ఉగ్రవాదుల నియామకం, నిధుల సమీకరణ, ఆయుధాల అక్రమ రవాణా, సరిహద్దు చొరబాట్లు, ఉగ్ర సంస్థలకు సహకారం వంటి చర్యల్లో పాల్గొంటున్నట్లు ఆరోపించింది.
జాబితాలో జైష్-ఎ-మహ్మద్కు చెందిన మసూద్ ఇల్యాస్ కశ్మీరీ, మొహమ్మద్ ముసద్దిక్, ముఫ్తీ మహ్మద్ అస్గర్ ఖాన్, అబ్దుల్లా జెహాదీ వంటి కీలక నేతలతో పాటు లష్కరే తోయిబాకు చెందిన ఫిర్దౌస్ అహ్మద్ భట్, హరూన్ రషీద్ గనాయ్ తదితరులు ఉన్నారు.
ఈ వ్యక్తులు ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడం, కొత్త సభ్యులను నియమించడం, భారత్‌లోకి చొరబాట్లకు సహకరించడం, ఉగ్రదాడుల ప్రణాళికలు రూపొందించడం వంటి కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించినట్లు కేంద్రం పేర్కొంది. అలాగే 2022 సుంజ్వాన్ దాడి, 2016 నాగ్రోటా ఆర్మీ క్యాంప్‌పై దాడి వంటి ఘటనలతో వీరికి సంబంధాలు ఉన్నట్లు కూడా నోటిఫికేషన్‌లో వెల్లడించింది.
2019లో యూఏపీఏ చట్టానికి చేసిన సవరణలతో ఉగ్ర సంస్థలతో పాటు వ్యక్తులను కూడా నేరుగా ఉగ్రవాదులుగా ప్రకటించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం పొందింది. అదే అధికారాన్ని వినియోగిస్తూ ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్లు హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
