బ్రిటీష్ పాలకుల సింహస్వప్నం అల్లూరి

గిరిజనుల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు: డీఆర్వో మోహన్ కుమార్

చిత్తూరు, ఆంధ్రప్రభ: స్వాతంత్ర్య సమరంలో బ్రిటీష్ పాలకులకు సింహస్వప్నంగా నిలిచి, గిరిజనుల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు సేవలు చిరస్మరణీయమని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) కే. మోహన్ కుమార్ అన్నారు.

అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా శనివారం జిల్లా సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ 1897 జూలై 4న సూర్యనారాయణమ్మ, వెంకటరామరాజు దంపతులకు జన్మించిన అల్లూరి సీతారామరాజు చిన్ననాటి నుంచే దైవభక్తి, దానగుణం, నాయకత్వ లక్షణాలతో ప్రత్యేక వ్యక్తిత్వాన్ని కనబరిచారని తెలిపారు. ఆధ్యాత్మిక జీవనశైలిని అనుసరిస్తూనే దేశ స్వాతంత్ర్యం కోసం పోరాట బాట పట్టారని పేర్కొన్నారు.

గిరిజనేతరుడైనా మన్యం ప్రాంత గిరిజనుల బాధలను తనవిగా భావించి, వారి హక్కుల పరిరక్షణ కోసం బ్రిటీష్ పాలకులను ధైర్యంగా ఎదుర్కొన్నారని అన్నారు. గిరిజనుల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యసాహసాలను నింపి స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అల్లూరి అతి చిన్న వయసులోనే వీరమరణం పొందారని గుర్తుచేశారు.

అల్లూరి సీతారామరాజు సేవలను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక జిల్లాకు ఆయన పేరును పెట్టడం ఆయనకు దక్కిన విశిష్ట గౌరవమని మోహన్ కుమార్ పేర్కొన్నారు. అల్లూరి జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని దేశభక్తి, సేవాభావం, పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.