World Peace | ప్రపంచ శాంతి మోదీతోనే సాధ్యం
World Peace | ప్రపంచ శాంతి మోదీతోనే సాధ్యం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు
డీపీఎస్ నాచారంలో ‘గ్లో పీస్’ అంతర్జాతీయ శాంతి సదస్సు
ప్రపంచ శాంతి కోసం ప్రధానికి లక్ష పోస్ట్‌కార్డులు పంపనున్న విద్యార్థులు..
యుద్ధాలకు శాంతే శాశ్వత పరిష్కారమని పిలుపు
World Peace | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ప్రస్తుత అంతర్జాతీయ ఉద్రిక్త పరిస్థితుల్లో ప్రపంచ శాంతి స్థాపనకు భారతదేశం కీలక పాత్ర పోషిస్తోందని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపైనే ప్రపంచ దేశాలు ఆశలు పెట్టుకున్నాయని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. హైదరాబాద్ నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో నిర్వహించిన ‘గ్లో పీస్’ అంతర్జాతీయ శాంతి సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, యుద్ధాల కంటే శాంతి సందేశమే ప్రపంచాన్ని రక్షించగలదని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్) ఆధ్వర్యంలో ‘గ్లో పీస్’ పేరుతో నిర్వహించిన అంతర్జాతీయ శాంతి సదస్సు ఘనంగా జరిగింది. వేలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, యువత, ఆధ్యాత్మిక గురువులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. వివిధ దేశాల మధ్య కొనసాగుతున్న ఘర్షణల కారణంగా వేలాది మంది అమాయక ప్రజలు, చిన్నారులు ప్రాణాలు కోల్పోతుండటంతో పాటు భారీ స్థాయిలో ఆర్థిక, మానవ, ఆస్తి నష్టాలు సంభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన హిరోషిమా, నాగసాకి అణు దాడులను ప్రస్తావిస్తూ.. నేటి పరిస్థితుల్లో అణ్వాయుధాల ముప్పు మానవాళి మనుగడకే ప్రమాదకరంగా మారిందని హెచ్చరించారు. యుద్ధాలు ఎన్నటికీ సమస్యలకు పరిష్కారం కాదని, శాంతి, సంభాషణల ద్వారానే శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని అన్నారు. ప్రపంచంలోని కొన్ని దేశాల నాయకత్వంలో ఈ దృక్పథం లోపించడం విచారకరమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా భారతదేశం ఎప్పటినుంచో శాంతిని కోరుకునే దేశమని, ‘వసుధైవ కుటుంబకం’ భావనతో ప్రపంచానికి మార్గనిర్దేశం చేస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ శాంతి కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచ దేశాల్లో ఆశాభావాన్ని కలిగిస్తున్నాయని అన్నారు.
విద్యార్థుల్లో శాంతి భావన పెంపొందించాలి
‘గ్లో పీస్’ వంటి కార్యక్రమాలు యువతలో శాంతి, సహనం, పరస్పర గౌరవం వంటి విలువలను పెంపొందించేందుకు ఎంతో ఉపయోగపడతాయని రాంచందర్ రావు అభిప్రాయపడ్డారు. శాంతి అనేది దేశాల మధ్య ఒప్పందాలతో మాత్రమే కాకుండా కుటుంబం, పాఠశాల, సమాజం నుంచే ప్రారంభం కావాలని సూచించారు. చిన్నప్పటి నుంచే విద్యార్థులు శాంతి, సహజీవనం, మానవతా విలువలను అలవర్చుకుంటే భవిష్యత్తు ప్రపంచం మరింత ప్రశాంతంగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యాన్ని, ఉపాధ్యాయ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ గడ్డపై ఇలాంటి అంతర్జాతీయ శాంతి సదస్సు నిర్వహించడం ద్వారా ప్రపంచానికి మంచి సందేశం అందించారని కొనియాడారు.
ప్రపంచ శాంతి కోసం లక్ష పోస్ట్‌కార్డుల ఉద్యమం
ప్రపంచ శాంతిని కోరుతూ విద్యార్థుల భాగస్వామ్యంతో ప్రత్యేక ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్లు రాంచందర్ రావు తెలిపారు. డీపీఎస్ నాచారం విద్యార్థులు మాత్రమే కాకుండా ఇతర విద్యాసంస్థల విద్యార్థులను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తూ మొత్తం లక్ష పోస్ట్‌కార్డులను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపనున్నట్లు వెల్లడించారు.
ప్రపంచ శాంతి కోసం మరింత చొరవ చూపాలని, శాంతి దూతగా ప్రపంచానికి మార్గనిర్దేశం చేయాలని కోరుతూ విద్యార్థులు తమ సందేశాలను పోస్ట్‌కార్డుల రూపంలో రాశారని చెప్పారు. పాఠశాల స్థాయిలో ప్రారంభమైన ఈ కార్యక్రమం భవిష్యత్తులో దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో విస్తరించి ప్రపంచ శాంతి ఉద్యమంగా రూపుదిద్దుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
